శ్రీకాకుళం జిల్లా పొందురు మండలంలో మరోసారి వైకాపాలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందే ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గీయులు తన్నుకున్నారు. ఈ ఘటన సరిగ్గా పొందరు వ్యవసాయ మార్కెట్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లే…పొందూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమ్మినేని వెళ్లారు. అప్పటికే అక్కడ రెండు గ్రూపులుగా ఏర్పాటైన వైకాపా శ్రేణుల్ని స్పీకర్ సమన్వయ పరిచే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అసభ్య పదజాలంతో ఒకర్ని ఒకరు తిట్టుకున్నారు.
చిన్నగా మొదలైన వివాదం అరుపులు…కేకలతో దద్దరిల్లింది. దీంతో వాతావరణ మరింత వేడెక్కింది. చివరకు ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒక వర్గానికే వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రాధాన్యం ఇచ్చారంటూ తమ్మినేని ముందే బాహాబాహాకి దిగారు. తమ్మినేని ఎంత నచ్చ జెప్పినా వినిపించుకోలేదు. ఇలాంటి వివాదాలు పార్టీకి మంచిది కాదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో స్పీకర్ అక్కడ నుంచి వెనుదిరిగారు. ఘర్షణ మొదలయ్యే సరికి పోలీసులు రంగ ప్రవేశం చేసారు. పోలీసులు ఇరువుర్నీ చెదరగొట్టి నచ్చ జెప్పడంతో వాతావరణం చల్లబడింది. అయితే స్పీకర్ ముందే రెండు వర్గాలు బాహాబాహీకి దిగడం పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
అదీ తమ్మినేని సొంత నియోజక వర్గంలోనే ఆయన మాట వినిపించుకునే పరిస్థితి లేకపోవడంతో అక్కడ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో! అంటూ టీడీపీ నేతలు నవ్వుకున్నారు. ఈ అంశాలు ఉత్తరాంధ్ర జిల్లా స్థాయి క్యాడర్ లో హాట్ టాపిక్ గా మారాయి. పొందురులో గతంలోనూ ఇలాంటి వివాదం ఒకటి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో వివాదం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పైగా ఇటీవలి కాలంలో వైకాపాలో ఆధిపత్య పోరు ఎక్కువైన సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతలే అయినదానికి..కానీ దానికి బాహాబాహీకి దిగడం పార్టీకి ఇబ్బందిగా మారుతోంది.