ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నా పంచాయితీ ఎన్నికల్లో ఎన్నో విచిత్రాలు జరుగుతున్నాయి. విజయమే అంతిమ లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ముందుకు సాగుతున్నాయి. అధికారం చేతిలో ఉండటం వైసీపీకి కొంచం ఎడ్జి గా మారింది. దీనితో నయానో భయానో అనుకున్న స్థాయిలో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తుంది. సామ,దాన,భేద,దండోపాయాలు ప్రయోగిస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఏకంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టకుండా ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అందుకే దానిని ఎన్నికల ప్రచారానికి వైసీపీ వాడుకోవటం మొదలుపెట్టింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ పంచాయితీలో వైసీపీ నేతలు పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డులను ఓట్లు స్లిప్ లతో కలిపి పంచుతూ శ్రీవారికి మహాపచారం తలపెట్టారు.
రేషన్ బియ్యం పంపిణీ చేసే వ్యానుల్లో తిరుమల లడ్డు తరలించినట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే ఎస్పీలకు 5 లడ్లు, మిగిలిన వారికీ 10 లడ్డు కింద పంచుతూ కుల వివక్షకు కూడా పాల్పడినట్లు ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికే ఓట్లు కోసం డబ్బులు వెదజల్లుతున్న కానీ, ఎక్కడ ఓట్లు పడవేమో అనే భయంతో ఏకంగా శ్రీవారి లడ్డులను కూడా పంచటం దారుణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల్లో ఓట్లు కోసం శ్రీవారి లడ్డులు పంచటం విషయంపై అనేక హిందూ సంఘాలు కూడా తీవ్రంగా విరుసుకుపడుతున్నాయి. తిరుమల కొండ మీద గంటలు గంటలు క్యూ లో నిలబడితే కానీ ఒక్క లడ్డు దొరకని పరిస్థితి. అలాంటిది కొన్ని వేల లడ్డులు ఎలా బయటకు వచ్చాయో అర్ధం కావటం లేదు. ఇందులో టీటీడీ అధికారుల హస్తముందని సృష్టంగా తెలుస్తుంది.
జగన్ సర్కార్ వచ్చిన నాటి నుండి తిరుమల పవిత్రత విషయంలో అనేక విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు కోసం శ్రీవారి లడ్డులు ఉపయోగించటం వలన వైసీపీ పార్టీ తీవ్ర ఇబ్బందులో పడటం ఖాయం. ఏది ఏమైనా ప్రసన్నమైన, నిర్మలమైన స్వామివారికి ప్రతిరూపమే ప్రసాదమని, అటువంటి ప్రసాదాన్ని తినుబండారాల మాదిరి, బహిరంగంగా అపవిత్రంగా పంచడం ఎంతమాత్రం క్షమార్హం కాదనే చెప్పాలి. .