వైఎస్ జగన్ సర్కారుకి వైసీపీ నేతల వెన్నుపోటు.?

అధికారంలో వుంటే, అడ్డగోలుగా వ్యవహరించొచ్చనే అభిప్రాయం చాలామంది రాజకీయ నాయకుల్లో వుంటుంది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. రాజకీయాల్లో ఎవరున్నా, వారి ఆలోచనలు ఇలానే వుంటాయేమో. అందరూ కాకపోవచ్చు, చాలామంది మాత్రం ఇలానే వుంటారనడానికి పలు సంఘటనలు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. కడప జిల్లా దువ్వూరుకి చెందిన ఓ మైనార్టీ కుటుంబం అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి భూ దందా కారణంగా బలవన్మరణానికి పాల్పడేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని బాధిత కుటుంబం సెల్ఫీ వీడియో ద్వారా మొరపెట్టుకుంది. బాధితుడు వైసీపీ కార్యకర్త కావడం గమనార్హమిక్కడ. అతన్ని బాధిస్తోన్నది వైసీపీకి చెందిన నాయకుడు అలాగే ఓ పోలీస్ అధికారి (సీఐ). ఒకటిన్నర ఎకరం భూమిని తన నుంచి వైసీపీ నేత తిరుపాల్ రెడ్డి లాక్కున్నారనీ, అతనికి ఎమ్మెల్యే మద్దతు వుందనీ, సీఐ కొండా రెడ్డి తనను బెదిరిస్తున్నారనీ వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నది అక్బర్ బాషా ఆవేదన.

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, సీఎం కార్యాలయం స్పందించింది. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెల్లడంతో, ఉన్నతాధికారులు స్పందించారు.. బాధిత కుటుంబం వద్దకు వెళ్ళారు. కాగా, వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎస్పీ అన్బురాజన్ తమకు హామీ ఇచ్చారని అక్బర్ బాషా తెలిపారు. కడపలో ఎస్పీని కలిశారు అక్బర్ బాషా. ముఖ్యమంత్రి కార్యాలయం వేగంగా స్పందించడాన్ని అభినందించి తీరాల్సిందే. అయితే, ఈ విషయమై స్థానిక పోలీసు యంత్రాంగం ఎందుకు ఆలస్యంగా స్పందించింది.? స్థానిక వైసీపీ నేతలెందుకిలా పేట్రేగిపోతున్నారు.? అన్నది తేలాల్సి వుంది. ప్రతి విషయంలోనూ సీఎం కార్యాలయం నేరుగా స్పందించే పరిస్థితి రాకూడదు. కొంతమంది వైసీపీ నేతల వల్ల, కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. వైసీపీ నేతలే కబ్జాలకు పాల్పడటమంటే, వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారని అనుకోవాలేమో.