జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ‘అద్దె మైకు’గా అభివర్ణిస్తోంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పవన్ మీద విమర్శలు చేయడానికి వైసీపీ నుంచి కొందరు నేతలు ప్రత్యేకంగా నియమించబడ్డారు.. అందులో పలువురు మంత్రులు కూడా వున్నారు. అయితే, పవన్‌ని విమర్శించే క్రమంలో సదరు నేతలంతా సంయమనం కోల్పోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఆయన మీద విమర్శలు చేయడం వల్ల వైసీపీకి వచ్చే అదనపు లాభమేంటి.? కింది స్థాయి నేతలెవరో విమర్శిస్తే అదో లెక్క.. మంత్రులే, ‘అద్దె మైకు’ అని విమర్శించడం వల్ల పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత పెరుగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఆ జగన్ కోసం వకాల్తా పుచ్చుకుంటున్నారు మంత్రులు. పవన్ కళ్యాణ్ అలా కాదు.. పవన్ కళ్యాణ్ ఓ పార్టీ అధినేత. అలాంటప్పుడు ఆయనెలా అద్దె మైకు అవుతారట.? గతంలోనూ ఇదే తీరు వైసీపీ నేతలది.
కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ, ‘బోడి లింగం’ అనేశారు పవన్ కళ్యాణ్. ఆ ఇంపాక్ట్ ఇప్పటిదాకా వుంది రాష్ట్ర రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే క్రమంలో వైసీపీ నేతలు అదుపు కోల్పోతున్నారు. అది పరోక్షంగా పవన్ కళ్యాణ్‌కి అడ్వాంటేజ్ అవుతోంది. ‘నాయుడు’ అంటూ పవన్ కళ్యాణ్‌ని కొందరు వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తోంటే, కాపు సామాజిక వర్గం గుస్సా అవుతోంది. ‘పవన్ కళ్యాణ్.. నాయుడే.. జనసేన నుంచి ఓ నాయుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశముంది.. వైసీపీ నుంచి ఆ అవకాశం వుందా.?’ అంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కొందరు సోషల్ మీడియా వేదికగా సవాల్ విసురుతున్నారు. ‘అద్దె మైకు’ విషయంలోనూ వైసీపీ నేతలకు ఇలాంటి సెటైర్లే పడుతున్నాయి. బీజేపీతో జనసేన జతకట్టడంపై విమర్శలు చేయడానికి చాలా స్కోప్ వైసీపీకి వుంది. అయితే, బీజేపీని విమర్శించాల్సి వస్తుంది, అలా చేస్తే మోడీ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది కాబట్టి వైసీపీ నేతలు తటపటాయిస్తున్నారని అనుకోవాలేమో.