YCP Govt Failures : వైసీపీ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న తప్పిదాలకు ఐఏఎస్ అధికారులకు శిక్ష పడుతుందా.? ఈ విషయమై విసక్షాలు చాలాకాలంగా చేస్తున్న ఆరోపణలు ఎందుకు నిజమని నిరూపితమవుతున్నట్టు.? అధికార వైసీపీ ఈ విషయమై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నిజానికి, ఆ సమయం ఎప్పుడో మించిపోయింది.!
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులేయడం దగ్గర్నుంచి, విశాఖలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిని పోలీసులు అరెస్టు చేయడం వరకు.. ఆ మాటకొస్తే చాలా సందర్భాల్లో అధికారుల తప్పులు బయటపడుతున్నాయి.
నిజానికి, అవేవీ అధికారులు చేసిన తప్పులు కావు, ప్రభుత్వ పెద్దల అత్యుత్సాహం కారణంగానో చోటు చేసుకున్న తప్పులన్న వాదన లేకపోలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాల్ని ఏర్పాటు చేయడమేంటి.? అన్న కనీసపాటి ఇంగితం లేకుండా జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలు, అధికారులకు తలనొప్పిగా మారాయి.
ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేయకపోతే పెద్దల నుంచి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. అందుకే, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేసేశారు. ఇంకోపక్క, అది అసంబద్ధమంటూ కోర్టు తీర్పునిచ్చినా, అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి.
కోర్టు ధిక్కరణ కేసు నమోదయ్యింది.. సీనియర్ ఐఏఎస్ అధికారులు కోర్టు ఆగ్రహాన్ని చవిచూశారు. ఏకంగా రెండు వారాల పాటు ఎనిమిది మంది అధికారులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. అయితే, కోర్టుకు అధికారులు క్షమాపణ చెప్పడంతో, శిక్షలో మార్పలు చేసింది.
సంక్షేమ హాస్టళ్ళకు నెలలో ఒక రోజు వెళ్ళి సేవ చేయాలని ఏడాది పాటు ఇలా చేయాలని, విద్యార్థుల మధ్యాహ్నం, రాత్రి భోజన ఖర్చులు, ఒక రోజు కోర్టు ఖర్చులు సొంతంగా భరించాలని న్యాయస్థానం ఆదేశించింది.
కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఐఏఎస్ అధికారులకి తెలియదా.? ఆదేశాలిచ్చిన ప్రభుత్వ పెద్దలు బాగానే వున్నారు, అధికారులే అడ్డంగా బుక్కయిపోయారు.