Jagan’s New U-Turn : విద్యుత్ షాక్.! ఈసారి ఇలా మడమ తిప్పిన సీఎం వైఎస్ జగన్.!

Jagan’s New U-Turn :  చంద్రబాబు హయాంలో విద్యుత్ ఛార్జీలు పెరిగితే, చాలా దీర్ఘాలు తీసి తాము అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు, అస్సలు విద్యుత్ ఛార్జీలు పెంచబోమనీ చెప్పుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కానీ, వివిధ రూపాల్లో విద్యుత్ ఛార్జీల్ని పెంచుకుంటూ పోతున్నారు.

తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపు దిశగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. వివిధ టారిఫ్‌లకు అనుగుణంగా ఈ పెంపు ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి కూడా.

జగనన్న ఉగాది కానుక.. అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసనలు కూడా షురూ అయ్యాయి.
మారిన పరిస్థితులకు అనుగుణంగా అన్ని రేట్లూ పెరుగుతున్నాయి.. అదే కోవలో విద్యుత్ ఛార్జీలు కూడా.

విద్యుత్ వాడకం పెరిగి, లభ్యత తగ్గుతుండడంతో విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయన్నది ఓ వాదన. అయితే, ఇలాంటి పరిస్థితుల్ని ముందే ఊహించకుండా ప్రతిపక్షంగా వున్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైసీపీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ధరల్ని పెంచడం ద్వారా విమర్శల్ని ఎదుర్కోకుండా వుంటుందా.?

రాజధాని సహా అనేక విషయాల్లో వైఎస్ జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు.. తప్పుతూనే వున్నారు, తిప్పుతూనే వున్నారంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

విపక్షాల మీద ఎదురుదాడికి దిగడం మినహా, అధికార వైసీపీ వద్ద విద్యుత్ ఛార్జీల పెంపు విషయమై సరైన ‘రీజన్’ కనిపించకపోవడం గమనార్హం. ఎన్నికలకు రెండేళ్ళ సమయమే వున్న దరిమిలా.. ఇప్పుడు ప్రభుత్వ పరంగా తీసుకునే ప్రతి నిర్ణయం ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపి తీరుతుంది.