మండలిలో పెరిగిన వైసీపీ బలం.. టీడీపీ పరిస్థితేంటి చెప్మా.!

YCP Gets Majority In Sasana Mandali Finally
YCP Gets Majority In Sasana Mandali Finally
శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ బలం తగ్గింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. దాంతో, ఇప్పడిక తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. గడచిన రెండేళ్ళుగా శాసన మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారం తమ చేతుల్లో వున్నా, కీలక బిల్లుల ఆమోదం విషయంలో టీడీపీ మోకాలడ్డటంతో తీవ్ర అసహనానికి గురవ్వాల్సి వచ్చింది అధికార పార్టీ. ఈ క్రమంలో మండలి ఛైర్మన్ కేంద్రంగా పెద్ద రచ్చ జరిగింది. ఛైర్మన్ మీద వైసీపీ నేతలు (మంత్రులు కూడా) జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
 
ఆ మండలి ఛైర్మన్, టీడీపీ నుంచి ఎంపిక కావడంతో.. వైసీపీకి సమస్యలు తప్పలేదు. కానీ, ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి. మండలి పూర్తిగా వైసీపీ వైపు మొగ్గు చూపబోతోంది. కొత్తగా నామినేట్ అయిన శాసన మండలి సభ్యులతో, మండలిలో వైసీపీకి పూర్తి ఆధిక్యం లభించినట్లే సంఖ్యా పరంగా. సో, ఇకపై మండలిలో ప్రభుత్వం ఏ బిల్లు విషయంలోనూ టెన్షన్ పడాల్సిన పనిలేదు. టీడీపీ, ఇదే మండలి వేదికగా మూడు రాజధానుల బిల్లు సహా అనేక బిల్లుల్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే.
 
అంతా బాగానే వుందిగానీ, మండలి అంటేనే ఖర్చు దండగ వ్యవహారం.. అని తేల్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ మండలి విషయమై తన ఆలోచనని వెనక్కి తీసుకుంటారా.? మండలి రద్దు దిశగా నిర్ణయం తీసుకుని, ఇప్పుడు మడమ తిప్పుతున్నారా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మండలి రద్దు అంశం కేంద్రం పరిధిలోకి వెళ్ళింది గనుక, కేంద్రం మండలి రద్దుపై నిర్ణయం తీసుకునేదాకా.. మండలి కొనసాగాలి గనుక.. ఆ దిశగా పార్టీకి చెందిన కీలక నేతలకు అవకాశాలు ఇచ్చుకుంటూ వెళుతున్నారు వైఎస్ జగన్.