కుప్పం పై కన్నేసిన వైసీపీ

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ పావులు కదువుతోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటోంది. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు విజయం అప్రహతిహతంగా కొనసాగుతుంది. అయితే కిందటి ఎన్నికల్లో ఆయన మెజారిటీ తగ్గింది. ఇంకా చెప్పాలంటే ఒకదశలో చంద్రబాబు వెనకబడిపోయారు. ఈ పరిణామం ఒక్క సారిగా టీడీపీ వర్గాలను చాలా ఇబ్బంది పెట్టింది. ఈ పరిణామాలు కుప్పంపై వైసీపీ వర్గాలను పునరాలోచించే విధంగా చేశాయి. సీఎం జగన్ ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పెషల్ అటెన్షన్ పెట్టారు. స్థానిక టీడీపీ నాయకులకు వైసీపీ కండువా కప్పేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు కుప్పంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చంద్రబాబు హయాంలో కంటే ఎక్కువగా అమలు అయ్యేలా వైసీపీ చర్యలు తీసుకుంటోంది. పదిహేనేళ్లుగా పూర్తికాని కుప్పం రైల్వే అండర్ బ్రిడ్జి పనులను కూడా పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. హంద్రీనీవా పనులను పూర్తి చేయాలంటూ రాష్ట్ర సర్కారుపై దాడిని పెంచారు. తెలుగు తమ్ముళ్లను ఆందోళనకు దింపారు. ఈ డిమాండ్ తో పాదయాత్రకు చేపట్టాలని స్థానిక టీడీపీ నేతలు భావిస్తున్నారు. కుప్పంలో పట్టు సడలిపోకుండా చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక నేతలతో రెగ్యులర్ గా వీడియోకాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో సొంతిళ్లు కట్టించి పేదలకు పంపిణీ చేయాలని వైసీపీ భావించింది.  స్థానికులను తమ వైపుకు తిప్పుకోవాలని వైసీపీ చూసింది. అయితే మిగతా నియోజకవర్గాల్లో ఈ పరిణామం ఇబ్బందికరంగా మారుతుందని పార్టీ నేతలు సూచించడంతో జగన్ వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది.

అయితే చంద్రబాబుకు పట్టున్న కుప్పంలో వైసీపీ బలపడడం అంత ఆశామాషి వ్యవహారం కాదని తెలిసినా వైసీపీ మాత్రం పట్టువీడడం లేదు. దీంతో కుప్పం నియోజకవర్గంలో రాజకీయ అలజడి మొదలైంది.