నామినేటెడ్ పోస్టుల ప్రకటనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. మొత్తం 135 కార్పొరేషన్లు, సంస్థల్లో ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తూ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ నామినేటెడ్ పోస్టుల ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్నారు.
నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అలంకారప్రాయం.. అన్న విమర్శలొస్తాయన్న కోణంలో కాస్త ముందే జాగ్రత్తపడి అవేవీ అలంకారప్రాయమైనవి కావని అన్నారు సజ్జల. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీలకు 76 శాతం పదవులు కేటాయించినట్లు చెబుతోంది అధికార వైసీపీ. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు పెద్ద పీట వేశామనీ చెప్పుకుంది.
పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, వీఎంఆర్డీయే ఛైర్ పర్సన్‌గా విజయనిర్మల, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ ఛైర్ పర్సన్‌గా బంగారమ్మ, మారిటైం బోర్డు ఛైర్మన్‌గా వెంకట్ రెడ్డి, టిడ్కో ఛైర్మన్‌గా ప్రసన్నకుమార్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషగిరి, ఏపీ సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్ రావు తదితరుల్ని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.
ఈ నామినేటెడ్ పదవుల భర్తీ విషయమై వైసీపీలో చాలాకాలంగా ఎదురుచూపులు కనిపిస్తున్నాయి. పదవుల ప్రకటన ఆలస్యమవడంపై కొంత ఆందోళన కూడా వ్యక్తమయ్యింది. నామినేటెడ్ పదవుల ప్రకటన తర్వాత ఇప్పుడందరి దృష్టీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ మీద పడింది. అయితే, దానికి ఇంకా సమయం వుందన్న సంకేతాలు అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకూ పదవుల పందేరం పెట్టిన వైసీపీ, ఆయా పదవుల్ని అలంకార ప్రాయంగా మార్చేసిందనీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి ముఖ్యమైన పదవులు కట్టబెట్టారనీ విపక్షాల విమర్శలు షరామామూలుగానే వినిపిస్తున్నాయి. కాగా, టీటీడీ ఛైర్మన్‌గా తిరిగి వైవీ సుబ్బారెడ్డినే నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.