తెలంగాణలో అన్ని నియోజకవర్గాలకీ ఉప ఎన్నికలా.? ఇదేం కోరిక.?

ఒక్క హుజూరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఉప ఎన్నిక జరగాలనే డిమాండ్ తెరపైకొస్తోంది. చిత్రమైన వాదన ఇది. అన్ని నియోజకవర్గాలకీ ఉప ఎన్నిక అంటే, కేసీయార్ సర్కార్ గద్దె దిగిపోవాలి. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్లు, ముఖ్యమంత్రి కేసీయార్ ఇంకోసారి అదే పని చేయాలి. కానీ, అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు. ఇప్పటి రాజకీయ పరిణామాలు వేరు. కేసీయార్ రాజకీయ వ్యూహం, ముందస్తు ఎన్నికలే అయితే.. ఆ ముందస్తు ఎన్నికలు తెలంగాణలో ఎప్పుడైనా రావొచ్చు. ఉప ఎన్నిక వచ్చిన ప్రతిసారీ, ఆయా నియోజకవర్గాలకు కేసీయార్ వరాలు ప్రకటించేస్తున్నారు. దాంతో, సహజంగానే.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ, ‘మా నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే బావుండు..’ అని జనం అనుకోవడాన్ని తప్పు పట్టలేం.

కానీ, ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలు, ఎన్నికల సమయంలో కురిపించే నిధులు.. మిగతా సమయాల్లో ప్రభుత్వాలు కురిపించడం సాధ్యమయ్యే పని కాదు. అంత బడ్జెట్ రాష్ట్ర ఖజానాలో వుండదు కదా. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ముందస్తు ఎన్నికల కోసం తొందరపడుతోంది. ఓ పక్క, అన్ని నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు రావాలంటూనే, ఇంకోపక్క.. ఇంకో 20 నెలలు మాత్రమే కేసీయార్, సీఎం కుర్చీలో వుంటారనీ.. ఆ తర్వాత జైల్లో వుంటారనీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెబుతున్నారు. ఇదిలా వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి సహా, తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రస్తుతం తెలంగాణలో మద్యంతర ఎన్నికల్ని కోరుకోవడంలేదు. ఎవరూ అందుకు సన్నద్ధంగా లేరు కూడా. అయినాగానీ, రాజకీయ పరమైన విమర్శలు చేయాలి గనుక, మొత్తంగా అన్ని నియోజకవర్గాలకూ ఉప ఎన్నిక రావాల్సిందేనంటూ.. కాంగ్రెస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా కోరుతోంది.