ప్రభుత్వాసుపత్రిలోని కరోనా వార్డులో చికిత్స పొందుతున్న మహిళను ఓ కాంట్రాక్ట్ వర్కర్ హత్య చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. కరోనా పేషెంట్ వద్ద డబ్బు, సెల్ ఫోన్ ఉండటం గమనించిన కార్మికురాలు వాటిని దొంగిలించేందుకు ఈ ఘాతుకానికి పాల్పడింది. విస్తుగొలిపే ఈ సంఘటన చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఆసుపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వెస్ట్ తాంబరమ్ లోని కడపేరికి చెందిన 41ఏళ్ల సునీత, మౌళి భార్యభర్తలు. సునీత గృహిణి కాగా.. మౌళి ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఫాకల్టీగా పని చేస్తున్నారు. ఈక్రమంలో సునీతకు కరోనా పాజిటివ్ తేలడంతో మే 23న ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. మరునాడు మే 24న మౌళి ఆసుపత్రికి వెళ్లి చూడగా కరోనా వార్డులో సునీత కనిపించలేదు. దీంతో మౌళి పోలిస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులకు సునీత జూన్ 8న హాస్పిటల్ వెనుక విగతజీవిగా.. దాదాపు కుళ్లిన స్థితిలో పడి ఉంది.
దీంతో బాడీని స్వాధీనం చేసుకుని ఆసుపత్రిలో విచారించారు. రతీదేవి అనే మహిళ సునీతను మూడో ఫ్లోర్ లో ఉన్న వార్డు నెంబర్ 268 నుంచి వీల్ చైర్ లో తీసుకెళ్లడం చూసామని చెప్పారు. దీంతో రతీదేవిని పిలిచి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సునీతను తానే హత్య చేసినట్టు రతీదేవి అంగీకరించింది. సునీత వద్ద ఉన్న సెల్ ఫోన్, 500 రూపాయల నోట్లు చూసి వాటిని దొంగలించేందుకే స్కానింగ్ కు తీసుకెళ్తున్నట్టు చెప్పి ఈ హత్య చేసినట్టు ఒప్పుకుంది. ఆమె నుంచి నగదు, సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రతీదేవి తిరువత్తియూర్ లో 22ఏళ్ల కుమారుడు, కుమార్తెతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త చనిపోయాడు. సునీతకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. దీంతో రతీదేవి ఆమెపై కాస్త ఒత్తిడి చేయగానే ఆమె చనిపోయినట్టు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకూడని సునీత పడుకున్నట్టే ఆమె మృతదేహాన్ని ఉంచిందని తెలిపారు. పోలీసులు రతీదేవిని అరెస్టు చేశారు.