వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయించేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే పలు సార్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ విషయమై ఫిర్యాదు చేసింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, భరత్ మార్గాని.. స్పీకర్ ఓం బిర్లాను కలిసి, రఘురామపై మరోమారు ఫిర్యాదు చేశారు.. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు.
కానీ, రఘురామపై అనర్హత వేటు పడే అవకాశం వుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడంలో ఏ స్థాయిలో ఆసక్తి చూపుతోందో అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ ఎంపీలు (రాజ్యసభ) నలుగురు, బీజేపీలోకి దూకేశారు. ఆ తర్వాత వారు సాంకేతికంగా బీజేపీ రాజ్యసభ సభ్యులైపోయారు.
కళ్ళ ముందు ఈ ఉదాహరణ స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, రఘురామపై అనర్హత వేటు ఎలా సాధ్యమవుతుంది.? అప్పట్లో తమ ఎంపీలు పార్టీ ఫిరాయించడంపై టీడీపీ ఫిర్యాదు చేసింది.. కానీ, అప్పట్లో ఆ ఫిరాయింపుల వ్యవహారంపై బీజేపీ వింత వాదనను తెరపైకి తెచ్చింది.
రఘురామకి, బీజేపీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ కారణంగానే ఆయన తనపై అనర్హత వేటుని తప్పించుకోగలుగుతున్నారన్న వాదనలున్నాయి. అయినా, రఘురామపై అనర్హత వేటు వేయించి వైసీపీ అదనంగా సాధించేదేముంటుంది.? అనర్హత వేటు అంటూ పడితే, రఘురామ మరింతగా చెలరేగిపోయే అవకాశం వుంటుంది. అది వైసీపీకి అంత మంచిది కాదు కూడా. రఘురామపై ఫోకస్ తగ్గించి, పరిపాలనపై అధికార వైసీపీ ఫోకస్ పెంచితే బావుంటుందన్న చర్చ వైసీపీ అభిమానుల్లో కూడా జరుగుతోంది.