Vishakhapatnam : ఇదిగో తోక.. అంటే, అదిగో పులి.. అన్నాడట వెనకటికి ఒకడు. అచ్చంగా అలాగే తయారయ్యింది విశాఖ రాజధాని వ్యవహారం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, విశాఖపట్నం నగరానికి రాజధాని హోదా దక్కి వుండాలి. ఎందుకంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో హైద్రాబాద్ తర్వాత ఆ స్థాయి నగరం విశాఖ మాత్రమే.
అయితే, విశాఖ మీద అమితమైన ప్రేమాభిమానాలు వున్నట్లు నటిస్తూ, విశాఖని నట్టేట్లో ముంచేసింది తెలుగుదేశం పార్టీ. తీర ప్రాంతమనీ, తుపాన్ల బెడద అనీ, రాష్ట్రానికి చివర్న వుందనీ.. ఏవేవో సాకులు చెప్పి, విశాఖను పక్కన పెట్టి, అమరావతిని రాజధానిగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది.
ఇక, అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అమరావతితోపాటు మరో రెండు రాజధానులంటూ పరిపాలనా వికేంద్రీకరణను తెరపైకి తెచ్చారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అంటూ పబ్లిసిటీ స్టంట్లు చేశారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల కారణంగా, మూడు రాజధానులకు ఇబ్బందులు తప్పవని తెలిసీ, మొండిగా మూడు రాజధానుల వైపు ముందడుగు వేసి, బొక్క బోర్లా పడింది వైఎస్ జగన్ సర్కార్.
త్వరలో, అతి త్వరలో విశాఖ రాజధాని కాబోతోందంటూ మళ్ళీ ప్రచారం జోరందుకుంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేసేస్తున్నారు కొందరు. ఇంకా రాజధాని వ్యవహారంపై కోర్టులో కేసులు నడుస్తూనే వున్నాయి. ఇలాంటి తరుణంలో, ఇంకోసారి ‘చేతులు కాల్చుకునే వ్యవహారం’ అధికార పార్టీ చేస్తుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
సరే, రాజకీయాల్ని కాస్సేపు పక్కన పెడదాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా తమ నగరానికి వస్తుందని మురిసిపోయిన విశాఖ ప్రజలు ఓ సారి భంగపడ్డారు. ఇప్పుడు ఏకంగా పూర్తి స్థాయి రాజధాని.. అంటూ లేనిపోని ఆశల్ని విశాఖ వాసులకు కల్పిస్తున్నారు కొందరు. విశాఖతోనే ఎందుకీ పొలిటికల్ ఆటలు.?