అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? నాసా ఏం చెప్పింది.? మన తెలుగు మీడియాకి ఏం అర్థమవుతోంది.? సముద్ర మట్టాలు పెరిగే అవకాశం వుందనీ, తద్వారా చాలా భారత నగరాలు ముంపుకు గురయ్యే అవకాశం వుందనీ నాసా హెచ్చరించింది. కానీ, ఇది ఇప్పటికిప్పుడు జరిగే వ్యవహారం కాదు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసిన హెచ్చరిక. ఆ హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకుని, ప్రమాదాన్ని నివారించడం అనేది ప్రభుత్వాల ముందున్న బాధ్యత. అంతేగానీ, రాత్రికి రాత్రి విశాఖ మునిగిపోతుందనో, దేశంలోని మరో నగరం కడలి గర్భంలో కలిసిపోతుందనో కాదు అర్థం. నిజానికి, చాలాకాలంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. క్రమక్రమంగా సముద్రం ముందుకొస్తూనే వుంది చాలా ప్రాంతాల్లో. మొత్తం భారతదేశమంతటా, ఆ మాటకొస్తే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఈ దుస్థితి.
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవబోతున్న నేపథ్యంలో తెలుగు మీడియాలో రచ్చ మొదలైంది. పచ్చ మీడియా, విశాఖపై విషం చిమ్ముతోంది. విశాఖ మునిగిపోవడం ఖాయమంటూ పుంఖానుపుంఖాలుగా కథనాల్ని వండి వడ్డిస్తోంది. సముద్ర తీర నగరాల్ని భారతదేశంలో లెక్కేసుకుంటే చాలానే వున్నాయి. అందులో చెన్నయ్, విశాఖ, ముంబై.. ఇలా చాలానే వున్నాయి. ఆయా నగరాలకు ముంపు ముప్పు పొంచి వుంది. అలాగని, ఆయా నగరాలు ఖచ్చితంగా మునిగిపోతాయని చెప్పలేం. ముంబైకి లేని సమస్య, చెన్నయ్ నగరానికి లేని ఇబ్బంది, విశాఖకు మాత్రమే వస్తుందా.? ఇదేం చోద్యం.? చాలా ఏళ్ళుగా విశాఖ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం మొదలు పెట్టారు. హుద్ హుద్ తుపాను సమయంలోనూ ఇలాంటి రచ్చే జరిగింది. రాజధాని అయ్యేందుకు అన్ని అర్హతలూ వున్న విశాఖని చంద్రబాబు హయాంలో పక్కన పెట్టడానికి కారణం ఓ సామాజిక వర్గం చేసిన లాబీయింగ్ అన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు అదే నీతిమాలిన రాజకీయం.. విశాఖ ఇమేజ్ డ్యామేజ్ చెయ్యాలని చూస్తోంది.