ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉండవల్లి మళ్ళీ రాబోతున్నారా.?

కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీతో లేరిప్పుడు. అలాగని ఆయన ఏ రాజకీయ పార్టీతోనూ లేరు. కానీ, ‘మేధావి’గా ముద్ర వేయించేసుకుని, అడపా దడపా రాజకీయ తెరపై కనిపిస్తుంటారు. మొన్నామధ్యన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జోరులో రాజకీయంగా ఓ వెలుగు వెలిగారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమం జరిగినప్పుడు సమైక్యవాదం వైపు ఉండవల్లి నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విడిపోనివ్వబోనంటూ హంగామా చేశారాయన.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, తనవంతుగా సుప్రీంకోర్టులో విభజన వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఆ తర్వాత ఏమయ్యిందో ఎవరికీ తెలియదనుకోండి.. అది వేరే సంగతి.

ఇంతకీ, ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారా.? లేదా.? మొన్నామధ్యన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల భర్త అనిల్ కూడా, ఉండవల్లితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అప్పట్లో అనిల్‌కి కూడా రాజకీయంగా కొన్ని సలహాలు ఇచ్చారట ఉండవల్లి.
అదేంటో, ఉండవల్లి కేవలం సలహాలకే పరిమితవుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి వచ్చేది ఎప్పుడో ఏమో.! అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి, ఉండవల్లి జనసేన పార్టీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.