తెలంగాణలో ప్రస్తుతం తెరాసకు వ్యతిరేక పవనాలు గట్టిగానే వీస్తున్నాయి. దుబ్బాకలో ఓడిపోవటంతో దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడే అవకాశం లేకపోలేదు. దీనితో ఎలాగైనా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా ఏమిటో చూపించాలని తెరాస పంతంతో ముందుకు వెళ్తుంది. ఇలాంటి తరుణంలో తెరాస కు షాకింగ్ కలిగించే ఒక వార్త ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఖమ్మంలో తెరాస పార్టీలో కీలక నేతగా ఉంటున్న తుమ్మల నాగేశ్వరరావు తెరాస కు గుడ్ బై చెప్పేసి బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో మంత్రిగా ఆయన ఒక వెలుగు వెలిగారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందినా తన అనుభవంతో గులాబీ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఖమ్మంలో తిరుగునేతగా మారాడు. మంత్రిగా వుండి కూడా గత 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మల నాగేశ్వర్ రావు దారుణంగా ఓడిపోవడంతో పరపతి దెబ్బతింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఎలాంటి పదవీలేక సతమతమవుతోన్నారు.
పార్టీలో తాను పెంచి పోషించిన నేతలు తన ఓటమికి పనిచేయడంతో 2018 ఎన్నికల్లో మరోసారి తుమ్మల ఓడిపోయాడు. అయితే ఓడిపోయిన నేతలను ముఖ్యంగా సీనియర్లను రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ పూర్తిగా దూరం పెట్టారు. దీంతో తుమ్మల రాజకీయ భవితవ్యం అయోమయంగా మారింది. అంతేకాకుండా తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ మాత్రం ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రిగా అవకాశమిచ్చారు.
ఇక మున్ముందు తెరాస లో తనకు సరైన స్థానం లభించటం కష్టమని భావించిన తుమ్మల పార్టీ మారటానికి సిద్దమవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరికొద్ది నెలల్లో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి, వాటి పూర్తి బాధ్యతలు మంత్రి పువ్వాడ అజయ్ కి అప్పగించాడు కేటీఆర్, దీనితో తుమ్మలకు అసంతృప్తి ఇంకా పెరిగిపోయింది. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ దూకుడుగా ఉండటంతో అటువైపు వెళితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కూడా తుమ్మల ఆలోచన అన్నట్లు తెలుస్తుంది. తుమ్మల లాంటి నేత తెరాస కు దూరమైతే ఖమ్మంలో పార్టీకి షాక్ అనే చెప్పాలి. అయితే కేసీఆర్ సరిగ్గా పట్టించుకోకపోవటం వలనే తుమ్మలకు పార్టీ మారే ఆలోచన వచ్చిందనేది వాస్తవం…