టీడీపీ గుర్తిపు రద్దవుతుందా.? సాధ్యమయ్యే పనేనా.?

 

తెలుగుదేశం పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని కోరతామంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమేనా.? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంత చిత్తశుద్ధి వుందా.? తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దవుతుందా.? అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది.

టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, పట్టాభి అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రజాస్వామ్యవాదులెవరూ ఈ బూతుల్ని సమర్థించరు. అదే సమయంలో, తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు లేదా అభిమానులు చేసిన దాడి కూడా సమర్థనీయం కాదు.

‘ప్రభుత్వం మీదా, నా మీదా బూతులు తిడుతున్నారు.. అలాంటివారిపైన నన్ను మన పార్టీని అభిమానించేవారికి, ప్రేమించేవారికి ఆగ్రహం కలుగుతుంది.. ఈ క్రమంలో రియాక్షన్ వుంటుంది..’ అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం వివాదాస్పదమయ్యింది. టీడీపీనే ఆ దాడి చేయించుకుందేమోనంటూ రాష్ట్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలూ విమర్శలకు తావిస్తున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మీద వైసీపీ ఫిర్యాదు చేయాలనుకుంటే.. అది పెద్ద పనేమీ కాదు. చిత్తశుద్ధి వుంటే, వైసీపీ నేతలు ఈ పాటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేవారే. కానీ, ఆ తర్వాతి పరిణామాలు ఎలా వుంటాయి.? మొత్తం సంఘటనలపై రివ్యూ చేస్తే వైసీపీదే పెద్ద తప్పు.. అని తేలిపోతుంది.

అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విమర్శలు చేసినప్పుడే.. ఆయన మీద కేసులు పెట్టి, అరెస్టు చేసి వుంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చి వుండేది కాదు. ఇప్పుడు పట్టాభి విషయంలో జరిగిన అరెస్ట్.. అప్పుడే ఎందుకు జరగలేదు.? పట్టాభిని అరెస్టు చేశారు సరే.. ఇవే తరహా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతల్ని ఎందుకు అరెస్టు చేయడంలేదన్న ప్రశ్న తెరపైకొస్తుంది ఖచ్చితంగా. అప్పుడు వైసీపీ, వైసీపీ ప్రభుత్వమే ఇరకాటంలో పడుతుంది. అదే చంద్రబాబు ధైర్యంగా కనిపిస్తోంది.