జనసేనాని పవన్ పంచన రఘురామ చేరతారా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత నియోజకవర్గంలో పర్యటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏ రఘురామకృష్ణరాజు చేతిలో అయితే తన సోదరుడు నాగబాబు ఓడిపోయారో, ఏ రఘురామరాజు గెలిచిన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గమైన భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోయారో.. అక్కడే, పవన్ కళ్యాణ్.. రఘురామకు మద్దతుగా మాట్లాడారు. క్షత్రియ సామాజిక వర్గాన్ని తనవైపుకు తిప్పుకునేందుకూ ప్రయత్నించారు.

పవన్ కళ్యాణ్ అంత ధైర్యంగా తనకు మద్దతు పలకడాన్ని రఘురామ స్వాగతించారు. పవన్ కళ్యాణ్ ధైర్యానికి హేట్సాఫ్ చెప్పారు. ‘పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అండగా వుండాల్సిన బాధ్యత నా మీద వుంది..’ అని కూడా వ్యాఖ్యానించారు.

‘నాకంటూ కొంత బలం వుంది.. కానీ, పవన్ కళ్యాణ్ పెద్ద నాయకుడు.. నా వల్ల ఆయన పార్టీకి పెద్ద లాభం కలుగుతుందని నేను అనుకోవడంలేదు.. ఇప్పటికైతే టీడీపీతో అయినా, జనసేనతో అయినా నేనేమీ కలిసి లేను..’ అని రఘురామకృష్ణరాజు వ్యూహాత్మకంగా వ్యాఖ్యానించారు.

మరోపక్క, రఘురామ జనసేనలో చేరబోతున్నారనీ, నర్సాపురం నుంచే పోటీ చేయబోతున్నారనీ, జనసేనకు ఆర్థికంగా అండదండలు ఆయన అందించబోతున్నారనీ ప్రచారమైతే జరుగుతోంది. ఈ ప్రచారంపై రఘురామ ప్రస్తుతానికైతే స్పందించలేదనుకోండి.. అది వేరే సంగతి.

నిజానికి, రఘురామ బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ కాకపోతే ఆయన ఆలోచనలు టీడీపీ వైపు వుంటాయి తప్ప, జనసేన వైపు వుండకపోవచ్చు.