దేశంలో పెట్రోల్ ధర 200 దాటుతుందా.?

Will Petrol Price Hit 200 Rupees Per Liter

Will Petrol Price Hit 200 Rupees Per Liter

దేశంలో పెట్రోల్ ధర సెంచరీ దాటుతుందని ఎవరైనా ఊహించారా.? అత్యంత వేగంగా, అనూహ్యంగా పెట్రో ధర సెంచరీ కొట్టేసింది.. లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. డీజిల్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సెంచరీ దాటేసింది.. మరికొన్ని రాష్ట్రాలూ అదే దిశగా అడుగులేస్తున్నాయి.

నిజానికి, అంతర్జాతీయ స్థాయిలో మరీ అంత దారుణంగా ముడిచమురు ధరలు పెరిగిపోలేదు. కానీ, దేశంలో పెట్రోల్ మీద చాలా రకాల పన్నుల కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వంటివాటిని కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయవనరులుగా చూస్తుండడమే ఈ దుస్థితికి కారణం. కేంద్రం ధన దాహం ఓ యెత్తు.. రాష్ట్రాల పైత్యం ఇంకో యెత్తు. వెరసి, ప్రజలకు పెను శాపంగా మారుతోంది పెట్రో ధరల పెరుగుదల.

అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు పెను సంక్షోభాన్ని రానున్న రోజుల్లో ఎదుర్కోవచ్చన్న అంచనాల నేపథ్యంలో దేశంలో పెట్రో ధరలు ఏ స్థాయికి పెరుగుతాయోనన్న ఆందోళన కనిపిస్తోంది. గతంలోలా 120 నుంచి 140 డాలర్ల దాకా బ్యారెల్ ముడి చమురు ధర పెరిగితే, దేశంలో పెట్రోల్ ధర డబుల్ సెంచరీ కొట్టేయడం పెద్ద కష్టమేమీ కాదు. ‘మేం దేశాన్ని ఉద్ధరించేస్తున్నాం..’ అని చెప్పుకుంటోన్న మోడీ సర్కార్, దేశ ప్రజల పట్ల కనీసపాటి కనికారం కూడా చూడంలేదు.

పెట్రోల్, డీజిల్.. అంటే కేవలం వాహనదారులకే కాదు, అందరికీ మోత మోగిపోతుంది. రవాణా రంగం సంక్షోభంలో పడిపోతుండడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే పెరిగిపోయాయి. రోమ్ తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడో లేదోగానీ, పెట్రో మంటలు దేశాన్ని దహించేస్తోంటే.. మోడీ సర్కార్ మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చుందన్నది నిర్వివాదాంశం.