పవన్ నిర్ణయం..మెగా ఫ్యామిలీ కి చేటు చేస్తుందా..?

KCR-Chiranjeevi

 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న బుధవారం అర్ధరాత్రి తెలంగాణ GHMC ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 50 డివిజన్స్ లో తమ పార్టీ కమిటీలను నియమించి, త్వరలో వచ్చే ఎన్నికల నాటికీ గ్రేటర్ పరిధిలో బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్రాలో ఎలాగూ బీజేపీతో పొత్తు ఉంటడంతో తెలంగాణలో కూడా దానినే కొనసాగిస్తూ, తన పార్టీని తెలంగాణలో పటిష్టం చేయాలనీ అనుకున్నాడు.

pawan kalyan kcr telugu rajyam

 పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం తెరాస పార్టీకి కొంచం నష్టం కలిగించే అవకాశం లేకపోలేదు. దానికి తోడు రేపటి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తూ ఆవేశంలో తెరాస పార్టీ మీద విమర్శలు చేయటం ఖాయం. వాటితో పవన్ కళ్యాణ్ కు తెరాస కు మధ్య విభేదాలు రావటం కూడా అంతే ఖాయం. అయితే రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను కేసీఆర్ సర్కార్ పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా కానీ, మరో విధంగా ఇబ్బంది పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మెగా ఫ్యామిలీ మొత్తం సినీ రంగంలో అగ్రస్థానంలో వున్నారు.

  అందులో నలుగురైదుగురు అగ్ర హీరోలుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు పవన్ తీసుకున్న నిర్ణయం వాళ్ళకి చేటు చేసే అవకాశం వుంది. పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైన సమయంలో ఎక్కువ షో లకు, సినిమా టిక్కెట్ రేట్ పెంచుకోవటం లాంటివి విషయంలో ఆయా నిర్మాతలు ప్రభుత్వ అనుమతి తీసుకోని ముందుకు వెళ్లేవారు.దీని వలన సినిమాకు కలెక్షన్స్ పెరిగే అవకాశం వుంది. టాలీవుడ్ లో పెద్ద హీరోలందరూ ఇదే పని చేస్తారు. ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ వద్ద నైజాం కలెక్షన్స్ చాలా ముఖ్యమైనవి. అందుకే టాలీవుడ్ పెద్దలు కేసీఆర్ తో సన్నిహితంగా వుంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ కేసీఆర్ మీద పోటీగా దిగటంతో రేపొద్దున్న ఆ ఫ్యామిలీ హీరోల సినిమాల విషయంలో కేసీఆర్ నుండి మద్దతు రాకపోవచ్చనే అభిప్రాయం వుంది.

 సినిమా సినిమానే, రాజకీయం రాజకీయమే అనుకోవటానికి ఛాన్స్ లేదు. కేసీఆర్ లాంటి నేత కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికేసే రకం కాబట్టి, పవన్ చేసే రాజకీయాలు కచ్చితంగా మెగా ఫ్యామిలీ హీరోల మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కరోనా వలన సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతుంది. పైగా మెగా ఫ్యామిలి హీరోల మీద ఏడాదికి 500 కోట్లు పైగా సినీ వ్యాపారం జరుగుతుంది. వీటికి తోడు కేసీఆర్ తో రాజకీయ వైరం వలన మరికొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం వుంది. దీనితో మెగా హీరోల మీద పెట్టుబడి పెట్టిన నిర్మాతల్లో ఇప్పటికే దీనిపై భయాందోళనలు మొదలైనట్లు తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం తమ మీద పడకుండా చిరంజీవి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటాడో లేదో చూడాలి మరి.