New Ministers Help Ys Jagan : ఈ మంత్రులతో వైఎస్ జగన్ ‘గెలుపు’ సాధ్యమేనా.?

New Ministers Help Ys Jagan

New Ministers Help Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ‘వైఎస్ జగన్ సర్కారు.. వెర్షన్ టూ పాయింట్ జీరో’ అంటూ వైసీపీ చాలా గట్టిగా చెప్పుకుంది. సామాజిక సమీకరణాలు, గెలుపు సమీకరణాలు.. అన్నీ పరిగణనలోకి తీసుకుని, 2024 ఎన్నికలే లక్ష్యంగా కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేసినట్లూ చెప్పుకున్నారు వైసీపీ నేతలు.

చెప్పిన మాటలకీ, చేస్తున్న పనులకీ ఏమన్నా పొంతన వుందా.? విద్యా శాఖను కేటాయించడం పట్ల అసహనంతో వున్న సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కాస్త తీరిగ్గా మీడియా ముందుకొచ్చారు.. సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంతేనా బొత్స చేయాల్సింది.?

మరోపక్క హోం మంత్రి, జల వనరుల శాఖ మంత్రి అవగాహనా రాహిత్యంతో ఆయా అంశాలపై మాట్లాడారు. ఐటీ మంత్రి, కేవలం పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి మాత్రమే.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మిగతా మంత్రులు కూడా ఇంకా పూర్తిగా యాక్టివ్ అవలేదు.. రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలకే పరిమితమవుతున్నారు.

వైఎస్ జగన్ తొలి క్యాబినెట్‌కి సంబంధించి చాలామంది మంత్రులకు అప్పట్లో ప్రజలతో నేరుగా సంబంధాలు కనిపించలేదు. ఎవరు ఏ శాఖకు మంత్రో జనానికి తెలియని పరిస్థితి. అప్పటితో పోల్చితే, ఇప్పుడు పరిస్థితి మరీ ఘోరంగా వుందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.

అధినేత మెప్పు కోసం.. అన్నట్టుగా వ్యవహరించే మంత్రులతో అటు ప్రభుత్వానికిగానీ, ఇటు వైసీపీకిగానీ ప్రయోజనం వుండదు. 2019 ఎన్నికల్లో పూర్తిగా వైఎస్ జగన్ ఇమేజ్ మీద వైసీపీ గెలిచింది. కానీ, 2024 ఎన్నికల్లో మంత్రుల అసమర్థత వైసీపీకి చేటు చేస్తుంది.