Mohanbabu : వైసీపీకి వ్యతిరేకంగా మోహన్‌బాబు పావులు కదుపుతారా.?

Mohanbabu : ‘నన్ను అందరూ వాడుకున్నారు.. నేను చాలా నష్టపోయాను..’ అంటూ సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తన పుట్టిన రోజు వేడుకల్లో. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు, అలాగే ఆయన నేతృత్వంలో నడుస్తోన్న శ్రీవిద్యా నికేతన్ వార్షికోత్సవాలు ఇటీవల జరిగాయి. ఈ సందర్భంగా మోహన్‌బాబు తన మనసులో బాధని బయటపెట్టారు.

గతంలో ఆయన టీడీపీ నేతగా పనిచేశారు. రాజ్యసభకు ఎంపికయ్యారు కూడా. టీడీపీకి దూరమై కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా వున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి, వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. కానీ, ఎన్నికల తర్వాత మళ్ళీ రాజకీయాల జోలికి మోహన్‌బాబు పోలేదు.

మోహన్‌బాబుని వైసీపీ రాజ్యసభకు పంపబోతోందని ప్రచారం జరిగింది. టీటీడీ ఛైర్మన్‌గిరీ ఆయనకు దక్కుతుందనీ ఊహాగానాలు వినిపించాయి. కానీ, అవేమీ జరగలేదు. ఆశించిన పదవులు దక్కకపోయేసరికి మోహన్‌బాబులో నైరాశ్యం పెరిగిపోయి, ఆ ఆవేదననే తన పుట్టినరోజు వేడుకల్లో మోహన్‌బాబు బయటపెట్టారా.? అన్న చర్చ జరుగుతోంది సినీ, రాజకీయ వర్గాల్లో.

2019 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై బాహాటంగానే విమర్శలు చేశారు మోహన్‌బాబు. ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ విషయమై ధర్నా కూడా చేశారు. ఇప్పుడు మోహన్‌బాబు నుంచి అలాంటి ఆందోళనల్ని మళ్ళీ చూడబోతున్నామా.? వైఎస్ జగన్‌తో బంధుత్వం వుండి కూడా మంచు కుటుంబం, వైసీపీకి వ్యతిరేకంగా పని చేయగలదా.?

ఏమోగానీ, మోహన్‌బాబు వ్యాఖ్యల్ని కొందరు వక్రీకరిస్తున్నారనీ, ఆయనకు వైసీపీ అన్యాయం చేయలేదనీ, వైసీపీకి ఆయన దూరమవబోరనీ వైసీపీ మద్దతుదారులు చెబుతున్నారు.