ప్రధాని మోడీ దగ్గర ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరిక చిట్టా చాలా పెద్దగానే ఉంది , గతంలో చంద్రబాబు కూడా ఇదే కోరికల చిట్టాను పట్టుకొని మోడీ వద్దకు వెళ్లిన కానీ ఎలాంటి లాభం లేదు.. అందులో ప్రత్యేక హోదా ఒకటి, పోలవరం ఒకటి, మరొకటి నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన. ఇందులో హోదా ని ఎప్పుడో పక్కన పెట్టేసారు, ఇప్పుడు పోలవరం విషయంలో కూడా కేంద్రం మెలిక పెట్టింది, ఇక మిగిలిన నియోజకవర్గాల పెంపు విషయంలో ఇప్పటికైతే ఎలాంటి హామీ ఇవ్వకుండా మౌనం పాటిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటికి మరో యాభై నియోజకవర్గాలు పెంచాలన్న ప్రతిపాదన ఉంది. అంటే మొత్తం 225 నియోజకవర్గాలు అవుతాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యే లను బాబు తన పార్టీలోకి చేర్చుకున్నాడు. ఆ సమయంలో నియోజకవర్గాల పెంపు కచ్చితంగా చేపట్టాలని భావించి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి దీని గురించి విన్నవించేవారు, కానీ కేంద్ర సర్కార్ మాత్రం దానిని పెండింగ్ లోనే పెట్టారు.
2008 లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. నిజానికి 2026 నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంది. కానీ విభజన చట్టంలో ఉండటంతో నియోజకవర్గాల పెంపు చేస్తారని భావించారు. నిజానికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల విభజన సమయంలో ఈ అంశం తెరపైకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పెంపు విషయాన్ని లైట్ గా తీసుకుంది.
ఇక ఇప్పుడు సీఎం జగన్ కూడా నియోజకవర్గాల పెంపు విషయంలో గట్టి పట్టుదలతోనే ఉన్నట్లు తెలుస్తుంది. 2024 ఎన్నికల సమయానికి ఆ పనిని పూర్తిచేసుకుంటే తమకు ఎక్కడెక్కడ పట్టుందో గమనించుకొని దానికి తగ్గట్లు నియోజకవర్గాల పునర్విభజన కూడా చేసుకోవచ్చని చూస్తున్నారు, కానీ కేంద్రం మాత్రం నియోజకవర్గాల పెంపు విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంటుంది. విభజన జరిగి ఆరేళ్ళు అవుతున్న కానీ అటు తెలంగాణ ఇటు ఆంధ్ర లో నియోజకవర్గాల పెంపు విషయంలో కేంద్రం అవలంబిస్తున్న వైఖరి పట్ల ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది