Mega Meeting : మెగా మంత్రం తెలుగు సినిమాని గట్టెక్కిస్తుందా.?

Mega Meeting :  మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.. భేటీ తర్వాత ‘సమస్యలు పరిష్కారమవుతాయ్..’ అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్నీమధ్యనే వివాదాల ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించారు. చర్చలు బాగా జరిగాయన్నారుగానీ, ఆ తర్వాత రివర్స్ గేర్ వేసేశారు.

అసలేం జరుగుతోంది తెలుగు సినీ పరిశ్రమకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య. సినిమా టిక్కెట్ల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడానికి కారణమేంటి.? ప్రభుత్వమైతే ఓ కమిటీ వేశామంటోంది. ఆ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి, కమిటీ సూచనల్ని బట్టి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం వుంటుంది.

కానీ, సినిమా టిక్కెట్ల ధరల అంశం అనేది ఇప్పుడు చాలా కీలకమైన విషయంగా మారింది. రాష్ట్రంలో ఇంకేమీ సమస్యలు లేవా.? కేవలం సినిమా టిక్కెట్ల ధర మాత్రమే అన్నిటికన్నా పెద్ద సమస్యా.? అన్న చర్చ సాధారణ ప్రజానీకంలోనూ జరుగుతోంది.

సంక్రాంతి నేపథ్యంలో బస్సు టిక్కెట్ల ధరల్ని ‘ప్రత్యేకంగా పెంచిన’ విషయం విదితమే. ఆ పెంపుతో పోల్చితే, సినిమా టిక్కెట్ల ధరలు ఏ రకంగా పెరిగినా అది పెద్ద విషయమే కాదు. నిత్యావసర వస్తువుల ధరలతో సినిమా టిక్కెట్ల ధరల్ని పోల్చినా అంతే.

వినోదాన్ని సామాన్యులకు అందుబాటులో వుండేలా చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడమే అర్థరహితం. దాన్ని సినీ పరిశ్రమ గట్టిగా ప్రశ్నించలేకపోతోందన్నది ఓపెన్ సీక్రెట్. అయితే, ఇక్కడ ప్రభుత్వాన్ని సినీ పరిశ్రమ ప్రశ్నించినా, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తోందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.