అగ్నిపథ్ రగడ: కేసీయార్ ప్రధాని అయిపోతారేమో.!

దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ స్పందించనంత వేగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ‘అగ్నిపథ్ స్కీమ్’ విషయంలో స్పందించారు. కేంద్ర నిర్ణయాన్ని తప్పు పట్టారు. సైనిక దళాల్లో ప్రైవేటైజేషన్ ఏంటి.? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి మండిపడుతోంది.

ఈ స్కీమ్ పట్ల నిరసన తెలియజేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ అనే తెలంగాణ బిడ్డ పట్ల ప్రగాడ సంతాపం వ్యక్తం చేస్తూ, అతని కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం కూడా కేసీయార్ ప్రకటించేశారు.

అంతేనా, జాతీయ స్థాయిలో కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీయార్ ఉద్యమించబోతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి చెబుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు, కేంద్రంపై మండిపడుతూ ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

‘తెలంగాణ ఉద్యమ సత్తా కేంద్రం గతంలో చూసింది. కేంద్రం మెడలు వంచడం తెలంగాణకు కొత్తేమీ కాదు. దేశ ప్రయోజనాల కోసం ఈసారి కొట్లాడబోతున్నాం.. సైన్యం పట్ల ఎవరైనా నిబద్ధతతో బాద్యతతో వ్యవహరించాల్సిందే.. ఈ విషయంలో తగ్గేదే లే..’ అంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి.

నిజానికి, అగ్నిపథ్ స్కీమ్ పేరుతో కేంద్రం పెద్ద పొరపాటే చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే కొరివితో తలగోక్కుంది. దేశంలో ఎవ్వరూ కేంద్రం నిర్ణయాన్ని సమర్థించడంలేదు, బీజేపీ భక్తులు మినహాయిస్తే. ఇదే కేసీయార్‌కి కలిసొచ్చే అంశం. కానీ, చాలామంది ముఖ్యమంత్రులు ఈ విషయంలో మౌనం దాల్చడం ఆశ్చర్యకరం.