సినీ నటి జీవిత, బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారా.?

జీవిత, ఆమె భర్త రాజశేఖర్.. సినీ పరిశ్రమలో తమదైన గుర్తింపు సంపాదించుకున్నారు. రాజకీయాల్లోనూ అంతే. కాంగ్రెస్‌లో వుండి అప్పట్లో చిరంజీవికి వ్యతిరేకంగా పని చేశారు. ఆ తర్వాత చిరంజీవితో కలిసిపోయారు. చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని కలిపేశారనుకోండి.. అది వేరే సంగతి.

సినిమా వేరు, రాజకీయాలు వేరని అనుకోవడానికి వీల్లేదు. రాజకీయ నాయకులకంటే వేగంగా సినీ జనాలూ రాజకీయ రంగులు మార్చేస్తుంటారు. ఈ లిస్టులో జీవిత రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలేమో. ఎప్పుడు ఏ పార్టీలో వుంటారో వాళ్ళకే తెలియదు. నిజానికి, జీవితకు మంచి వాగ్ధాటి వుంది. కానీ, దాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

నిఖార్సుగా రాజకీయాలు చేయగలిగితే, రాజకీయంగా చాలా ఉన్నతమైన స్థానంలోనే జీవిత వుండేవారేమో. కానీ, కలగాపులగం రాజకీయాలు చేస్తుంటారు. అందుకేనేమో, సినీ రాజకీయాల్లోనూ జీవిత రాణించలేకపోతున్నారు. నటిగా సినిమాలు ఏమీ చేయడంలేదామె. కానీ, దర్శకురాలిగా, నిర్మాతగా తన పేరుని తరచూ చూసుకోవాలని ఆరాట పడుతుంటారు వెండి తెరపై.

తాజాగా జీవిత, బీజేపీలో కనిపిస్తున్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. కేవలం తెలంగాణ రాజకీయాలకే పరిమితమా.? అన్న ప్రశ్నకు ఆమె ఇంకా సమాధానం చెప్పాల్సి వుంది. గతంలో ఆమె ఫోకస్ ఏపీ రాజకీయాలపై వుండేది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.

బీజేపీకి సినీ గ్లామర్ బాగానే వుంది. విజయశాంతి బీజేపీలోనే వున్నారు. మరి, జీవిత రాకతో ఈక్వేషన్స్ మారతాయా.? ఏమోగానీ, జయసుధ కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జీవిత, ఒకింత తొందరపడినట్లే కనిపిస్తోంది. కేవలం ప్రచారం వరకు పరిమితమయ్యే పాత్రలే లభిస్తుంటాయి జీవితకి రాజకీయాల్లో. కానీ, ఆమె తాను ఈసారి పోటీ చేస్తానంటున్నారు. సాధ్యమయ్యే పనేనా అది.?