జనసేనను నాదెండ్ల మనోహర్ వీడతారా.? వైసీపీలో చేరబోతున్నారా.?

జనసేన పార్టీకి చెందిన ఓ కీలక నేత వైసీపీలో చేరబోతున్నారట.! ఎవరా జనసేన కీలక నేత.? నిజానికి, జనసేన పార్టీలో కీలక నేతలంటే, అది కేవలం నాదెండ్ల మనోహర్ మాత్రమే. దాదాపుగా పార్టీకి చెందిన ముఖ్య వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహర్ మాత్రమే చక్కబెడుతుంటారు. ఈ విషయమై పార్టీలో అంతర్గతంగా చాలా రచ్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే వుంటుంది.

‘అబ్బే, నాదెండ్ల మనోహర్ విషయంలో వివాదాలకు తావు లేదు. ఆయన సీనియర్ పొలిటీషియన్. పైగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పని చేశారు..’ అంటూ జనసేన నేతలు తరచూ చెబుతుంటారు. గతంలో స్వర్గీయ ఎన్టీయార్‌కి నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పొడిచినట్లే.. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ జనసేన అధినేతను రాజకీయంగా వెన్నుపోటు పొడుస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తూ వుంటాయ్.

ఇదిలా వుంటే, జనసేన కీలక నేత అయిన నాదెండ్ల మనోహర్, పార్టీ మారడం ఖాయమైపోయిందంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది. వైసీపీ నుంచి ఆయనకు ఈ మధ్యనే ఓ బంపర్ ఆఫర్ కూడా వచ్చిందట. పార్టీలో చేరితే తక్షణం మంత్రి పదవి.. అంటూ వైఎస్ జగన్, నాదెండ్ల మనోహర్‌కి నేరుగా ఆఫర్ ఇచ్చారన్నది ఆ గాసిప్ సారాంశం.

కానీ, ఈ విషయమై వైసీపీ శ్రేణులు పెదవి విప్పడంలేదు. అసలు నాదెండ్ల మనోహర్‌తో వైసీపీకి ఎలాంటి అవసరమూ లేదని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. కొన్ని చేరికల విషయమై ‘అవసరాలు’ వేరేలా వుంటాయ్. నాదెండ్ల మనోహర్ గనుక జనసేనను వీడితే, జనసేన పార్టీ బలహీనమవుతుంది. అంతకన్నా వైసీపీకి ఇప్పుడు కావాల్సింది ఇంకేముంటుంది.?

రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ప్రజారాజ్యం పార్టీని చాలామంది వెన్నుపోటు పొడిచారు. ఒకళ్ళా ఇద్దరా.? పరకాల ప్రభార్ దగ్గర మొదలెడితే.. డజను మంది.. కాదు కాదు, ఓ వంద మంది వెన్నుపోటు పొడిచి వుంటారు. జనసేనకూ అలాంటి వెన్నుపోట్లు ఎదురయ్యాయ్. కానీ, నాదెండ్ల గనుక  పార్టీ వీడితే.. అదే అతి పెద్ద వెన్నుపోటు అవుతుంది.