ఏపీలో జనసేన, బీజేపీ రెండు ఒకేతాటిమీద నడుస్తున్నాయి. రెండు పార్టీల సిద్ధాంతం ఒకటేనట. అందుకే రెండూ కలిసిపోయాయి. పొత్తు పెట్టుకున్నాయి. అంతవరకు బాగానే ఉన్నది కానీ.. ఈ రెండు పార్టీలు కలిసి రాజధాని సమస్యలపై పోరాటం చేస్తాయా? అనేదే పెద్ద ప్రశ్నార్థకం
బీజేపీ , జనసేన దేనికి పొత్తుపెట్టుకున్నాయో దేవుడెరుగు. ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయా? లేదా? అనేది కూడా పక్కన పెడదాం. కానీ… ఈ రెండు పార్టీలు నిజంగా ప్రజల సమస్యలపై కలిసి పోరాడుతాయా? అంటే ఎవ్వరి దగ్గరా సమాధానం లేదు.
దానికి కారణాలు అనేకం. ఎందుకంటే రెండు పార్టీల ఆలోచనలు వేరు. అభిప్రాయాలు వేరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏమంటున్నారు? రాజధాని రైతులకు అండగా ఉంటాం. రాజధాని రైతల సమస్యలను పరిష్కరించడం కోసం పోరాడుతాం. రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండబోదు.. అంటూ చెప్పుకొచ్చారు.
మరి.. పవన్ కల్యాన్ మాత్రం.. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి అంటున్నారు. రాజధానిని మారుస్తామంటే ఆందోళన చేస్తామంటున్నారు.
ఇదివరకు పవన్ కల్యాణ్ ను సోము వీర్రాజు కలిసినప్పుడు కూడా వీళ్లిద్దరి మధ్య రాజధాని అంశం తెర మీదికి వచ్చింది. దీనిపై సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి నిర్ణయం తీసుకుందామని అనుకున్నారు.
కానీ.. రెండు పార్టీల కార్యాచరణ వేరువేరుగా ఉంటోంది. ఒకటే రాజధాని అని పవన్ నొక్కి చెబుతుంటే.. వీర్రాజు మాత్రం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి అంటున్నారు. అదే బీజేపీ డిమాండ్ అంటున్నారు. ఒకరిది తూర్పు… ఇంకొకరిది పడమర అయినప్పుడు ఇద్దరూ కలిసేది ఎలా? ఇదే… ప్రస్తుతం ఏపీ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న.