శ్రీలంకతో భారతదేశాన్ని పోల్చవచ్చా.? ఎంతవరకు సబబు.?

Srilanka

పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఆ దేశాన్ని ఎంతలా బజార్న పడేసిందో కళ్ళారా చూస్తున్నాం. మితిమీరిన అప్పులు, రాజకీయ అవినీతి.. వెరసి శ్రీలంకకి ఈ దుస్థితి వచ్చింది. మరి, మన భారతదేశం ముందు ముందు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోబోతోంది.?

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభం గురించి చర్చ జరిగిందట. ఈ సందర్భంగా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంపై కేంద్ర ప్రభుత్వం క్లాసులు పీకిందట. అలా క్లాసులు ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా వుందట. తెలంగాణకీ చురలకు అంటించారట.

ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో బోల్డంత రాజకీయ రచ్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ, ఈ విషయమై నోరు మెదపడంలేదు. తెలంగాణలో అధికారంలో వున్న తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం, కేంద్రంపై విరుచుకుపడుతోంది.

‘రాష్ట్రాలు చేస్తున్న అప్పుల సంగతి సరే.. దేశం చేస్తున్న అప్పుల మాటేమిటి.? అప్పులు చేస్తున్నారు.. ఆ డబ్బులేమైపోతున్నాయో మాత్రం చెప్పడంలేదు..’ అంటూ గులాబీ నేతలు, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీపై మండిపడుతున్నారు.

అన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీ మోత మోగించేస్తున్నారు, పెట్రో ధరల మంట పుట్టించేస్తున్నారు.. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్నంటేశాయి.. ఎటు చూసినా ఆర్థిక క్రమశిక్షణ అన్న మాటకే తావు లేకుండా పోయింది దేశంలో. రాజకీయ సంక్షోభమొక్కటే భారతదేశంలో ప్రస్తుతానికి లేదు.