Schools Shut Down : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం. స్కూళ్ళకు సెలవుల్ని పొడిగించడమే ఆ కీలక నిర్ణయం. సంక్రాంతి సెలవుల్ని ఈ నెలాఖరు వరకు పొడిగించేశారు. ఒకరకంగా చెప్పాలంటే స్కూళ్ళను, ఇతర విద్యా సంస్థల్ని ఈ నెలాఖరు వరకు మూసివేయడమన్నమాట.
నిజానికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం కొంత మేర సబబే.
కానీ, కేవలం స్కూళ్ళు మూసేయడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందా.? షాపింగ్ మాల్స్, పర్యాటక కేంద్రాలు, సినిమా థియేటర్లు.. ఇలా అన్నీ తెరిచేసి, కేవలం విద్యా సంస్థలు మూసివేయడం వల్ల ఉపయోగం వుండదు.
అయితే, కోవిడ్ కట్టడి దిశగా తెలంగాణ మంత్రి మండలి ఈ రోజు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్న దరిమిలా, ఆయా రంగాలపై ఆంక్షలు విధిస్తారేమో వేచి చూడాల్సి వుంటుంది.
కోవిడ్ కారణంగా రెండేళ్ళపాటు విద్యా వ్యవస్థ సర్వనాశనమైపోయింది. చాలా ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడీకి తెగబడ్డాయి. ఆ దోపిడీ అలా అలా కొనసాగుతూనే వుంది. క్లాసుల నిర్వహణ సరిగ్గా లేకపోయినా, దోపిడీ మాత్రం తగ్గడంలేదు. అయినా, ప్రభుత్వాలు ఈ దోపిడీని అరికట్టేందుకు కనీసపాటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
గడచిన రెండు, రెండున్నరేళ్ళుగా సరైన చదువులు లేక విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయింది. మళ్ళీ ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద కోవిడ్ ఇంకోసారి పిడుగులా పడుతోంది. చదువుల్లో నాణ్యత గురించి మాట్లాడుకోవడానికే వీల్లేని పరిస్థితి ఏర్పడింది.
విద్యా సంస్థల్ని తెరచి విద్యార్థుల్ని కోవిడ్‌కి బలిపెట్టాలని ఎవరూ కోరుకోరు. అదే సమయంలో, విద్యాభ్యాసం అనేది అయోమయంలో పడిపోవడాన్నీ సమర్థించలేం. ఇదో వింత సమస్య. ప్రతి యేడాదీ ఇదే సమస్య పునరావృతమవుతోంటే విద్యార్థుల భవిష్యత్ ఏమైపోవాలి.?