నేటి ఉదయమే ఏపీ సహా పలు రాష్ర్టాల్లో రాజ్యసభ ఎన్నికలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏపీలో నాలుగు స్థానాలకు గాను ఐదుగురు పోటీ పడుతున్నారు. వైకాపా నుంచి నలుగురు కాగా, టీడీపీ నుంచి ఒకరు బరిలో నిలిచారు. టీడీపీ కి ఓటమి తధ్యమని తెలిసినా చంద్రబాబు బీసీ నేత వర్ల రామయ్యను పోటీకి దించారు. బీసీ లు టార్గెట్ గానే వర్లను రంగంలోకి దించారన్నది అందరికీ తెలిసిందే. బీసీలను అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లు రాజకీయాలు చేసిన చంద్రబాబుకు గత ఎన్నికల్లో అదే వర్గం చావు దెబ్బ కొట్టింది. అంతా జగన్ కి జై కొట్టడంతో టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో వర్ల ని బరిలోకి దించి బీసీలపై తనకున్న దొంగ ప్రేమను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గెలవరని తెలిసినా…బీసీలకు తాను ఇస్తోన్న ప్రయార్టీ ఇదని చూపించడానికి..చెప్పుకోవడానికి చేస్తోన్న ప్రయత్నం. ఇదంతా వచ్చే ఎన్నికల కోసం సానుభూతి కవ్వింపే. ఇక వైకాపా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపీదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి బరిలో ఉన్నారు. ఈ నలుగురి గెలుపు తధ్యమే. అయితే ఇక్కడే ఏపీ యంగ్ సీఎం ఓటు ఎవరికి పడుతుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ నలుగురిలో జగన్ ఛాయిస్ ఎవరై ఉంటారని ప్రజల్లో హాట్ టాక్ అవుతోంది. అయితే జగన్ ఓటు బీసీ వర్గానికి చెందిన రాజ్యసభ అభ్యర్ధి పిల్లి సుభాష్ చంద్రబోస్ కే కేటాయించినట్లు తెలుస్తోంది.
జగన్ సొంత మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. వైకాపా అభ్యర్ధుల తరుపున రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఏజెంట్ లుగా ఉన్నారు. టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య కు ఏజెంట్ గా ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఎన్నికల ఫలితాలు సాయంత్రం ఐదు గంటల తర్వాత వెలువడనున్నాయి. నాలుగు గంటలవరకూ ఎన్నికలు జరుగుతాయి. ఆ వెంటనే లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది.