Chandrababu : గతంలో ఎన్నడూ లేనంతగా అప్రమత్తమవుతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారం నేపథ్యంలో. ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో నారాయణ అరెస్టు జరిగితే, ఆ అరెస్టు అక్రమమంటూ టీడీపీ చేసిన హంగామా తెలిసిందే.
ఈ వ్యవహారంలో అధికార పక్షం కుట్ర పూరితంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ, ఇటు రాష్ట్ర గవర్నర్‌కీ అటు కేంద్ర హోం శాఖ మంత్రికీ లేఖలు రాశారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. గతంలో అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో కావొచ్చు, మరికొందరు మాజీ మంత్రుల అరెస్టుల సమయంలో కావొచ్చు, చంద్రబాబు ఇంతలా స్పందించలేదు.
నారాయణ అరెస్టు తర్వాత, తన మీదకే వైసీపీ సర్కారు వస్తుందని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. ‘దమ్ముంటే అరెస్టు చేసుకోండి..’ అని పైకి చెబుతున్నా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ఏపీ సీఐడీ చేసిన సత్కారం నేపథ్యంలో, చంద్రబాబు ఒకింత లోలోపల ఆందోళన చెందుతున్నమాట వాస్తవం.
అందుకేనేమో, లీగల్ టీమ్‌ని చంద్రబాబు యాక్టివేట్ చేశారు. నారాయణ అరెస్టు మొదలుకొని, బెయిల్ వచ్చేదాకా.. చంద్రబాబు అస్సలేమాత్రం ఊపిరి పీల్చుకోలేనంత బిజీగా వ్యవహరించారట. అంతా బాగానే వుందిగానీ, ఇన్ని చేసినా అమరావతి స్కాం నుంచి చంద్రబాబు తప్పించుకోగలరా.? ఒకవేళ చంద్రబాబు అరెస్టయితే ఏమవుతుంది.?
ఇంకేమవుతుంది, అరెస్టు తర్వాత బెయిల్ రావొచ్చు, రాకపోనూవచ్చు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. పైగా, వీటి వల్ల అదనపు పబ్లిసిటీ వస్తుందంతే.