Central Govt Help : కేంద్రం బుద్ధిగా విన్నదట.! ఇంతకీ సాయం చేస్తుందా.? లేదా.?

Central Govt Help : కేంద్రం, రాష్ట్ర సమస్యల పట్ల సానుకూలంగా వుందట. సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో వున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు సెలవిచ్చారట. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధి బృందం, కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారుల బృందంతో సమావేశం జరిగింది ఢిల్లీలో. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు ఏపీ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

‘ఆల్ ఈజ్ వెల్.. త్వరలోనే తీపి కబురు అందుతుంది..’ అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఏంటీ, నిజమేనా.? ప్రత్యేక హోదా కోసం ఎనిమిదేళ్ళుగా రచ్చ నడుస్తోంది.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరాహార దీక్ష కూడా గతంలో చేశారు. చంద్రబాబు హయాంలోనూ ధర్మ పోరాట దీక్షలు చేసేశారు అప్పటి అధికార పార్టీ నేతలు. కానీ, ప్రత్యేక హోదా రాలేదు.

రాజధాని వున్నా లేనట్టే. పోలవరం ప్రాజెక్టు అతీ గతీ లేనట్టుంది. వెనుక బడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీ ఏమయ్యిందో తెలియదు. చెప్పుకుంటూ పోతే కథ పెద్దదే. పాడిందే పాటరా. పాచిపళ్ళ డాష్ డాష్ అన్నట్టుంది వ్యవహారం.

రాష్ట్రమేమో పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కేంద్రం పూర్తిస్థాయిలో ఆదుకుంటే తప్ప, రాష్ట్రం ముందడుగు వేసే పరిస్థితే లేదు. అయినా, కేంద్రం దిగి రావడంలేదు. అధికార పార్టీ నేతలేమో ఢిల్లీలో ఆల్ ఈజ్ వెల్ అంటున్నారు.. రాష్ట్రంలోకొచ్చేసరికి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రానికి ఏం లాభం.. ఇలాగైతే.!