పంచ్ ప్రభాకర్‌ని సీబీఐ అరెస్టు చేయగలదా.?

పంచ్ ప్రభాకర్ ఎవరు.? అన్న చర్చ తెలుగు నాట చాలా జోరుగా సాగుతోందిప్పుడు. కారణం, పంచ్ ప్రభాకర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుండడమే. వైసీపీ మద్దతుదారుడైన పంచ్ ప్రభాకర్, సోషల్ మీడియా వేదికగా, ఇతర రాజకీయ పార్టీలపై దూషణలకు దిగుతున్నాడు. అత్యంత హేయంగా అతని బూతులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసేస్తున్నాయి.

న్యాయస్థానాలపైనా దిగజారుడు స్థాయిలో వ్యాఖ్యలు చేసినట్లు పంచ్ ప్రభాకర్‌పై అభియోగాలున్నాయి. గతంలోనే పంచ్ ప్రభాకర్ మీద కేసులు నమోదైనా, ఆ కేసుల విచారణ నత్తనడకన సాగింది. చివరికి న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు విచారణను సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది. సీబీఐ చేతికి వచ్చాక కూడా ఈ కేసులో ‘స్తబ్దత’ అలాగే వుందన్న ఆరోపణలు లేకపోలేదు.

విదేశాల్లో వుంటోన్న పంచ్ ప్రభాకర్‌ని అరెస్టు చేయడం అంత తేలిక కాదు. అలాగని అది అసాధ్యం కూడా కాదు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేసినా, అవి దేశం లోపలే జరిగాయి. పంచ్ ప్రభాకర్ కోసం గాలింపు చేపట్టిన సీబీఐ, ఎట్టకేలకు ‘బ్లూ’ నోటీసుల్ని ఇంటర్ పోల్ ద్వారా జారీ చేసింది. అంతే కాదు, దౌత్య మార్గాల ద్వారా అతన్ని అరెస్టు చేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టింది.

అయితే, ‘నన్నెవడూ ఏమీ చేయలేడు..’ అనే ధీమాతో ఇంకా పంచ్ ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన పోస్టులు పెడుతూనే వున్నాడు. ఈ నేపథ్యంలో, అసలు సీబీఐ సత్తా ఎంత.? సీబీఐని సవాల్ చేస్తున్న పంచ్ ప్రభాకర్ పరిస్థితి ఏమవుతుంది.? అన్న విషయమై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఒక్కటి మాత్రం నిజం.. ఓ రాజకీయ పార్టీకి మద్దతు పలకడం, లేదా వత్తాసు పలకడం.. ఈ క్రమంలో ఇతర పార్టీలపై విమర్శలు చేయడం తప్పు కాకపోవచ్చు. కానీ, అది ముదిరి పాకాన పడి, వ్యవస్థలపై దూషణలకు దిగడం మాత్రం సమర్థనీయం కాదు.