ఆంధ్ర ప్రదేశ్.. తెలంగాణ.. మళ్లీ కలిసిపోతే…సాధ్యమయ్యే పనేనా?

Telangana

పోలవరం ప్రాజెక్టు పంచాయితీ నేపథ్యంలో, మళ్ళీ ఉమ్మడి తెలుగు రాష్ట్రం అనే అంశం తెరపైకొచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిమిత్తం, ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కి బదలాయించిన భూభాగంలో కొంత మేర తమకు తిరిగిచ్చేయాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో కాక రేగింది. దీనిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఎటాక్ చేస్తూ, హైద్రాబాద్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగిస్తారా.? అని ప్రశ్నించారు.

అంతే కాదు, ‘రెండు రాష్ట్రాల్నీ మళ్ళీ కలిపేద్దామా.? అందుకు మీరు ఒప్పుకుంటారా.?’ అంటూ బొత్స ప్రశ్నించడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్ళు పూర్తయిపోయింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ సహా పలు సమస్యలున్నా, రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీల మధ్య అత్యంత సఖ్యత వుంది.. గడచిన మూడేళ్ళుగా.

అయితే, బీజేపీ విషయంలో వైసీపీ, టీఆర్ఎస్ మధ్య అభిప్రాయ బేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీతో వైసీపీ అంటకాగుతోంటే, బీజేపీతో తగవు పెట్టుకుంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ క్రమంలో వైసీపీ, టీఆర్ఎస్ మధ్య గ్యాప్ పెరిగినట్లే కనిపిస్తోంది.

ఆ గ్యాప్ కారణంగానే, పోలవరం రగడ తెరపైకి వచ్చిందనేది ఓ వాదన. ఆ క్రమంలోనే హైద్రాబాద్ అంశమూ, ఉమ్మడి తెలుగు రాష్ట్రం అంశమూ చర్చకు తెస్తున్నారు వైసీపీ నేతలన్నది ఇంకో వాదన. వీటిల్లో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటయ్యే పరిస్థితి అయితే లేదు.