నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై రాష్ర్ట వ్యాప్తంగా ఎంత దుమారం రేగిందో తెలిసిందే. ప్రస్తుతం సుధాకర్ కేసు పోలీసులు..కోర్టు దాటి సీబీఐ చేతిలో ఉంది. ఇక్కడ తప్పు ఎలా జరిగింది? ఎవరిది? అన్నది పక్కనబెడితే సుధాకర్ మాత్రం మానసీకంగాను..శారీరకంగాను చితికిపోయిన మాట మాత్రం వాస్తవం. కుటుంబానికి శాంతి లేక పోలీసులు..కోర్టులు..కేసులు అంటూ తిరగాల్సిన సన్నివేశం ఎదురైంది. ఓ సామాన్య మానవుడి జీవితంలో ఇలాంటి ఘనటలు చాలా పెద్దవనే చెప్పాలి. రాజకీయానికి సంబంధం లేని ఈ విషయాన్ని తర్వాత పూర్తిగా రాజకీయం చేసి నానా యాగీ చేసారు.
ఇక్కడ అధికార పక్షం తప్పుందా? ప‌్రతిపక్షం పాత్ర ఉందా? అన్నది పక్కన బెడితే సుధాకర్ ని మాత్రం మానసికంగా ఇబ్బంది పెట్టడంలో అధికార-ప్రతిపక్షం పాత్రలు మాత్రం కచ్చితంగా ఉన్నాయి. ఎవరి స్వలాభాలు కోసం వాళ్లు సుధాకర్ ని ఓ పావులా వాడుకునే ప్రయత్నమైతే జరిగింది. ప్రస్తుతం సుధాకర్ గతాన్ని మర్చిపోయి మళ్లీ పాత జీవితాన్ని కోరుకుంటున్నాడు. దీనిలో భాగంగా అజ్ఞాతంలో గడుపుతున్నాడు. తాజాగా మరో దళిత వైద్యురాలు అనితారాణి ని వైకాపా నేతలు వేధిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదు చేసిన సంగతి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనితారాణికి మద్దతు పలుకుతూ ప్రతిపక్ష పార్టీ టీడీపీ రంగంలోకి దిగింది.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఉద్దేశిస్తు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. నారాయణ స్వామిగారు మీ నియోజక వర్గంలో ఉన్న పెనమలూరు వైద్యశాలలో దళిత డాక్టర్ పై మీ నాయకులు అసభ్యంగా, కులం పేరుతో తిట్టి, మానసికంగా ఇబ్బంది పెడుతుంటే పట్టించుకోరా? అనితారాణిని కూడా మరో సుధాకర్ ని చేసే ఆలోచనలో ఉన్నారా? అంటూ మండిపడ్డారు. అనితారాణి ని కూడా సుధాకర్ లా చేస్తారని ఇన్నాళ్లు ఆమె మీడియా ముందుకు రాలేదంటూ దుయ్యబెట్టారు. దీంతో ఈ వ్యవహారం కూడా రాష్ర్టంలో సంచలనంగా మారడం ఖాయమనిపిస్తోంది.
అనితారాణి ఆరోపణలో నిజం ఎంత? మార్చిలో జరిగితే ఇప్పటివరకూ అనితారాణి మీడియా ముందుకు ఎందుకు రానట్లు? అసలు ఉన్నత అధికారులు ఎందకు పట్టించుకోనట్లు? అధికార పక్షంపై కోర్టు మొట్టలికాయలు వేస్తున్నప్పుడే న్యాయం గుర్తొచ్చిందా? అన్నది తేలాల్సి ఉంది. ఆ తర్వాత ప్రతిపక్షాలు ఆరోపించాలి. కానీ ఇక్కడ వర్ల రామయ్య అవేమి పట్టించుకోకుండా వ్యాఖ్యానించడం కాస్త అనుమానదాస్పదంగా ఉందంటూ వైకాపా నేతలు మండిపడుతున్నారు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో.