షాకింగ్: భార్యకు అంత్యక్రియలు జరిపిన భర్త..! కానీ.. మరునాడే ఇంటికొచ్చింది..

కరోనాతో చనిపోయింది నీ భార్యే అంటూ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ఓ మృతదేహాన్ని భర్తకు అప్పగించారు. అసలే కరోనా మృతి కావడంతో ఆ మృతదేహం భార్యదో కాదో చూడలేదు భర్త. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చి చివరి చూపు చూడక అంత్యక్రియలు జరిపించాడు. గ్రామస్థులు కూడా కరోనా నిబంధనలు కావడంతో ఆ మృతదేహం వద్దకు ఎవరూ రాలేదు. పదో రోజు కార్యక్రమం కూడా జరిపించాడు. అయితే.. ఆమరునాడే ఆమె ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది. ఒక్క క్షణం నమ్మలేకపోయాడు భర్త. చిత్రమైన ఈ సంఘటన విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

జగ్గయ్యపేట మండలం క్రిష్టియన్ పేట గ్రామానికి చెందిన 70 ఏళ్ల ముత్యాల గిరిజమ్మ కరోనాకు గురైంది. మే12న ఆమెను చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించాడు భర్త గాదయ్య. కరోనా వార్డులో ఆమెకు చికిత్స ప్రారంభించారు. అయితే.. మే 15న భర్తకు ఆమె వార్డులో కనిపించలేదు. తిరిగాడు.. వెతికినా కానీ ఆమె కనిపించలేదు. విచారస్తే.. ఆమె చనిపోయిందని చెప్పి ఓ మృతదేహాన్ని అప్పగించారు సిబ్బంది. దీంతో అదేరోజున గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మే 23న వారి 35 ఏళ్ల కుమారుడు రమేశ్ కూడా కరోనాతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందాడు.

మొత్తంగా జూన్ 1న భార్య, కుమారుడికి సంబంధించి వారి చివరి కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే.. అనూహ్యంగా మరునాడే గిరిజమ్మ ఇంటికి క్షేమంగా తిరిగివచ్చింది. దీంతో కుటుంబసభ్యలు.. విషయం తెలిసి గ్రామస్థులు అందరూ షాకయ్యారు. ఆరా తీయగా.. తనకు కరోనా నయమైందని చెప్పుకొచ్చింది. తనను ఆదరించేవారు లేకపోయారని బాధ పడింది. తన పరిస్థితి తెలుసుకుని ఆస్పత్రి వర్గాలే రూ.3000 ఇస్తే ఇంటికి వచ్చానని చెప్పింది. ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో వేరెవరికో చెందిన మృతదేహానికి గాదయ్య అంత్యక్రియలు జరిపించాడు. విస్తుపోవడం అందరి వంతైంది.

దీనిపై జగ్గయ్యపేట పోలీసులు విచారణ చేపట్టారు. అయితే.. అంత్యక్రియలు జరుపుకున్న మృతదేహం గురించి విజయవాడలో కూడా కేసు నమోదు కాలేదని పోలీసులు అంటున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.