ఏంటో కలికాలం. క్షణికావేశాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు కొందరు. ప్రాణాలు తీస్తున్నారు మరికొందరు. బంధాలు, బందుత్వాలైతే అస్సలే లేవు ఈ రోజుల్లో. ఈ జనరేషనే వేరు. వాళ్లు ఏం అనుకుంటే అదే చేస్తారు. వాళ్లకు ఏది నచ్చితే అదే. అడ్జస్ట్ మెంట్ అనే పదానికి అర్థమే తెలియదు నేటి జనరేషన్ కు.
భర్త.. భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, తండ్రి కొడుకును చంపడం, కొడుకు తండ్రిని చంపడం.. ఇలాంటి ఎన్నో ఘోరాలను మనం రోజూ వార్తల్లో చూస్తున్నాం.
అలాంటి ఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్నది. 24 పరగణాల జిల్లాకు చెందిన అనిందితా పాల్ అనే యువతి.. తన భర్త రజత్ డేని ఫోన్ చార్జర్ కేబుల్ ను మెడకు చుట్టి మరీ చంపేసింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన అనిందితాకు 24 పరగణాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
స్వతహాగా న్యాయవాది అయిన అనిందితా పాల్.. భర్తతో గొడవల వల్ల క్షణికావేశంలో మొబైల్ చార్జర్ కేబుల్ ను మెడకు చుట్టి ఉరి వేసి చంపేసింది. ఆ తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తనే ఈ నేరం చేసినట్టు ఒప్పుకుంది. వెంటనే విచారణ ప్రారంభించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. తను చేసిన నేరం రుజువు కావడంతో… యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించడంతో మరో ఏడాది పాటు తనకు జైలుశిక్షను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.