పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ వారసత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నేపథ్యంలో, వారసత్వం గురించి జరుగుతున్న చర్చలకు ఆమె పరోక్షంగా స్పందించారు.
ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ తన రాజకీయ వారసుడు ఎవరు అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా, దీనిపై నిర్ణయం పూర్తిగా పార్టీకి చెందినది అని స్పష్టం చేశారు. “నిర్ణయాలు వ్యక్తిగతం కావు, పార్టీ సమష్టిగా తీసుకుంటుంది. టీఎంసీ ఒక కుటుంబం, ప్రతి కార్యకర్త కృషే దీని బలం,” అని ఆమె అన్నారు.
మమతా వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీ సీనియర్ నేతలు, యువ నాయకత్వం మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఆసక్తికరంగా మారాయి. టీఎంసీ పార్టీలో క్రమశిక్షణ కీలకమని, ఎవరి ఆధిపత్యం చూపేందుకు స్థానం లేదని మమతా స్పష్టం చేశారు. తన ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలతో కలిపి ప్రజాసేవే ప్రధాన లక్ష్యమని చెప్పారు.
అయితే, అభిషేక్ బెనర్జీ పేరు మమతా వారసుడిగా ప్రతిపాదనల రూపంలో ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ, ఈ వ్యాఖ్యలతో మమతా బెనర్జీ దానిపై స్పష్టత ఇవ్వకుండానే సవరణను చూపించారు. “పార్టీ కోసం ఎవరి పాత్ర అవసరమైతే వారే ముందుకు వస్తారు, ఇది సమష్టి నిర్ణయం,” అంటూ ఆమె వ్యాఖ్యలు టీఎంసీ భవిష్యత్ గురించి మరింత చర్చకు దారితీశాయి.