లావు కృష్ణదేవరాయలును వైసీపీ నేతలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? టీడీపీలోకి వెళ్తాడనేనా!

వైసీపీలో ఉన్న ఎంపీలందరి కంటే ఉత్తమమైన ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది లావు కృష్ణదేవరాయల మాత్రమే. ఆయనకు రాజకీయాలు ఎలా చెయ్యాలో తెలుసు అలాగే ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాలు కూడా అంటే బాగా తెలుసు. ఆయన వైసీపీ భావాలను కూడా పార్లమెంట్ లో బలంగా వినిపించే నాయకుడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన్ను కొంత మంది వైసీపీ నాయకులే టార్గెట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. లావు కృష్ణదేవరాయలుకు రజనికు మధ్య ఉన్న వివాదాల్లో కూడా వైసీపీ కీలక నేతలు రజనికే మద్దతు ఇస్తున్నారు. అయితే లావుపై వైసీపీ నాయకులకు ఎందుకంత కోపం అంశం ఇప్పుడు రాజకీయ చర్చలకు దారి తీస్తుంది.

లావు కృష్ణదేవరాయలుపై వైసీపీ నాయకులకు ఎందుకంత కోపం ?

వివాదాలకు దూరంగా ఉంటూ అభివృద్ధిపై దృష్టి పెట్టిన అతికొద్ది మంది వైసీపీ నాయకుల్లో లావు కృష్ణదేవరాయలు ఒకరు.అలాంటి నేతపై సొంత వైసీపీ నేతలే కోపంగా ఉన్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. వైసీపీ నాయకుల కోపానికి లావు కృష్ణదేవరాయలు తండ్రి రత్తయ్య కారణమని తెలుస్తుంది. రత్తయ్య టీడీపీ నాయకుడు. ఆయన వైసీపీపై గత కొన్ని రోజుల నుండి వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్యే రాజధాని తరలింపుపై ఆయన రాసిన వ్యాసం ఒకటి పత్రికల్లో కూడా వచ్చింది. ఈ విషయమే ఇప్పుడు లావు కృష్ణదేవరాయలుపై వైసీపీ నాయకుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. దీంతో పైకి ఏమీ అనే ఉద్దేశం లేక‌.. లావును ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని ప్రచారం జ‌రుగుతోంది.

లావు టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉందా !

తండ్రి రత్తయ్య ఎలాగో టీడీపీలో ఉన్నాడు కాబట్టి రానున్న రోజుల్లో లావు కృష్ణదేవరాయలు కూడా టీడీపీ వెళ్తాడానే ప్రచారం కూడా వైసీపీ నాయకులే చేస్తున్నారు. ఈ కారణాల వల్లే ఎమ్మెల్యే విడదల రజనికి లావు కృష్ణదేవరాయలకు ఉన్న వివాదాల్లో వైసీపీ కావాలనే రజనికి మద్దతు ఇస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక లావు సైతం వివాదాల‌కు ర‌జ‌నీ, బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్లతో విబేధాలు ఉన్నా సొంత ఇమేజ్ కోసం చాప‌కింద నీరులా ప్రయ‌త్నాలు చేస్తూ త‌న వ‌ర్గాన్ని బ‌లోపేతం చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ వ్యతిరేకత రానున్న రోజుల్లో కూడా కొనసాగితే లావు టీడీపీలోకి వెళ్లినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక రకంగా చూస్తే పార్టీలకు అతీతంగా తన ఇమేజ్ ను పెంచుకున్నారు. కాబట్టి ఆయనకు జగన్మోహన్ రెడ్డి అవసరం కానీ చంద్రబాబు అవసరం కానీ అస్సలు లేదు.