2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రైస్తవ మతం అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ అంశం చుట్టూ చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ అంశంపై కేంద్రానికి ఒక లేఖ వెళ్ళింది. అందులో వైసీపీ ప్రభుత్వం క్రిస్టియనైజేషన్‌కి మద్దతు ఇస్తుందని నేరుగా ప్రధాని మోడీకి ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలా వ్యవహరించడం వల్ల హిందువులకు, క్రైస్తవులకు ఇబ్బందులు వస్తున్నాయని ఆ లేఖలో ఉన్నట్టు సమాచారం. ఆ లేఖ రాసింది వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.
రఘురామకు క్రిస్టియానిటీపై ఎందుకంత శ్రద్ద!!
క్రిస్టియనైజేషన్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో క్రిస్టియన్ పాస్టర్లకు 5 వేల రూపాయల సాయం సహా పలు కీలక అంశాల్ని పేర్కొన్నారట. 2011 లెక్కలప్రకారం రాష్ట్రంలో 1.8 శాతం క్రిస్టియన్లు వున్నారనీ, ప్రస్తుతం అది 25 శాతానికి చేరుకుందని మీడియా సాక్షిగా కూడా చెప్పారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా 33వేల చర్చిలు నిర్మితమయ్యాయని, వాలంటీర్లను ఉపయోగించి, పాస్టర్ల వివరాల్ని సేకరించి, వారికి పెద్దయెత్తున ప్రభుత్వం ‘లబ్ది చేకూర్చే’ చర్యలు చేపడుతోందనీ, ఇందుకు కలెక్టర్ల వ్యవస్థనూ వినియోగిస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. ఇలా రఘురామ క్రిస్టియానిటీపై శ్రద్ద పెట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని, ఆయనను రాజకీయంగా దెబ్బతియ్యడం కోసమే ఇలా ప్రభుత్వానికి మతాన్ని అంటకడుతున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు.
క్రిస్టియానిటీతో జగన్ కు ఇబ్బందులు వస్తాయా!!
ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ క్రిస్టియానిటీ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మత రాజకీయాలు చెయ్యడంలో దిట్ట అయిన బీజేపీకి కూడా ఏపీలో స్థిరపడటానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఈ అంశం వల్ల వైసీపీ ఇబ్బందులు పడటం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే తిరుమల డిక్లరేషన్ పై బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు చేసిన రచ్చ తెలిసిందే. ఈ క్రిస్టియానిటీ అనే అంశం వల్ల జగన్ రానున్న రోజుల్లో వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.