ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని ముఖ్యమైన విషయాలను ఎందుకో చూసీ చూడనట్టు ఉంటున్నారు. పని భారమో ఏమో తెలీదు కానీ చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం వలన వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. అంతేకాదు ప్రత్యర్థుల చేతికి చిక్కిపోతున్నారు. ఇటీవల ఆంధ్రాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోనసీమ జిల్లాలు, సీమ జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. చేతికొచ్చిన పంట నీళ్లపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఇలాంటి సమయంలోనే వారు ప్రభుత్వం అండను, నాయకులను భరోసాను కోరుకుంటారు. అందుకే చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ను పర్యటనలు ఉసిగొల్పారు. లోకేష్ కూడ అనంతపురం వెళ్లి రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అది లోకేష్ పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడేలా చేసింది.
ఇదే టైంలో ప్రభుత్వం నష్టపోయిన రైతులను పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి కనీసం పర్యటనకు రాలేదని, పలకరించలేదని, వస్తే ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయమని ఎద్దేవా చేశారు. ఈ మాటలతో జగన్ పర్యటన తప్పకుండా ఉంటుందని అనుకున్నారు. మామూలుగానే వరాలిచ్చే జగన్ ఇలా పర్యటనకు వచ్చి కష్టలు చూశారంటే ఇంకా ఎక్కువ వరాలిస్తారని రైతులు ఆశించారు. కానీ జగన్ ముంపు ప్రాంతాల్లో పర్యటన చేయలేదు. దీంతోప్రతిపక్షం విమర్శలకు పదునుపెట్టింది. ప్రజల్లో వ్యతిరేకత పెరగడం వల్లనే జగన్ భయపడి పర్యటన చేయలేకపోయారనిలేకుంటే ఎందుకు రారని ప్రశ్నలు గుప్పించారు. అయినా అధికార పక్షంలో స్పందన లేదు.
అలాగే జగన్ ఇటీవల ఏలూరులో పర్యటించి అక్కడ కొన్ని కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. మాజీ మేయర్ నూర్జహాన్ కుమార్తె వివాహానికి వెళ్లిన ఆయన పనిలో పనిగా పర్యటన చేశారే తప్ప కావాలని ఏలూరులో పర్యటించలేదు. పైగా ఈ పర్యటన కోసం జిల్లా మంత్రులు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసుకున్నారు. ఇలా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అందునా మంత్రులు దగ్గరుండి చేయడం చూస్తే అధికార పార్టీలో భయం మొదలైందా అనే అనుమానం కలుగుతోంది. విపక్షాలు సైతం ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నారు కాబట్టే పర్యటనలు చెట్లేదని వేలెత్తి చూపిస్తున్నారు.