YS Jagan : ఆర్టీసీ బస్సు ఛార్జీల విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తోంది.? పండగ వేళ ప్రయాణీకుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం ద్వారా రాష్ట్రానికి ఒనగూడే అదనపు ప్రయోజనమేంటి.? ఈ అంశంపై వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. వేల కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తున్న వైఎస్ జగన్ సర్కార్, ఆర్టీసీ ప్రయాణీకుల మీద అదనపు భారం మోపడం దురదృష్టకరమన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.
తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సుల్ని పండగ కోసం వేసినా, వాటిల్లో అదనపు ఛార్జీలు లేవు. ఇది సహజంగానే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొంత అసంతృప్తిని తమ ప్రభుత్వంపై పెరిగేలా చేస్తుంది. సంక్రాంతి అంటే, ఆంధ్రప్రదేశ్‌లో చాలా చాలా పెద్ద పండగ. సంక్రాంతికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారు.
తెలంగాణలో.. మరీ ముఖ్యంగా హైద్రాబాద్‌లో స్థిరపడ్డ చాలామంది ఇంకా తమ సొంతూరితో సంబంధాలు ఘనంగానే కొనసాగిస్తున్నారు. వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నా, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు ఛార్జీల పేరుతో వాత పెడుతుండడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
నిజానికి, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆర్థిక ప్రయోజనమేమీ కాదు. కాకపోతే, తిరుగు ప్రయాణంలో ఆయా ప్రత్యేక బస్సులు పూర్తిగా నిండవు గనుక.. అన్న కోణంలో చాలాకాలంగా ఈ అదనపు ఛార్జీల వాత మోగుతూనే వుంది. దానికి వైఎస్ జగన్ సర్కార్ బ్రేక్ వేయగలిగితే.. ఖచ్చితంగా ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది.
సలహాదారులు పనికొచ్చే సలహాలు ఇవ్వడంలేదా.? ప్రభుత్వమే ఈ విషయంలో మొండిగా ముందుకు వెళుతోందా.? ఏమోగానీ, సంక్షేమ పథకాల వల్ల వచ్చిన మంచిపేరు, ఇలాంటి చర్యలతో మంటగలిసిపోతోందన్నది నిర్వివాదాంశం.