తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ ఇంకా అయిపోలేదు. రోజురోజుకీ ముదిరి పాకాన పడుతోంది. ‘దాదిగిరీ’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలతో వివాదం మళ్ళీ మొదటికొచ్చింది. దీనిపై ఏపీ నుంచి కూడా ఓ మోస్తరుగా ఎదురుదాడి షురూ అయ్యింది. ఇదంతా ఎందుకు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒక్క చోట కూర్చుని సమస్యకు పరిష్కారం వెతుక్కోవచ్చు కదా.? అంటే, ఆ అవకాశం ఎప్పుడో చేజారిపోయిందనే అనుకోవాలి. ఎందుకంటే, ఇరు రాష్ట్రాల మధ్యా నెలకొన్న ఈ అనవసరపు వాతావరణం నేపథ్యంలో కేంద్రం, కృష్ణా అలాగే గోదావరి నదీ యాజమాన్య బోర్డుల్ని ఏర్పాటు చేస్తూ ఇటీవల గెటిట్ విడుదల చేసింది. సో, ఇప్పుడు ఇరు రాష్ట్రాలూ ఏం మాట్లాడాలన్నా, ఆయా బోర్డుల వద్దనే మాట్లాడుకోవాలి. అంతకు మించి, చేయడానికేమీ లేదు. ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా బోర్డుల చేతుల్లోకి వెళ్ళిపోయింది.. ఆ బోర్డులు ఎటూ కేంద్రం కనుసన్నల్లోనే నడుస్తాయి. ఇంకా ఈ గెజిట్ అమల్లోకి రాలేదుగానీ, రావడం ఖాయం.
సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ తీరుని ఏపీ ఎండగట్టేందుకు ప్రయత్నించగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వీ రమణ, ఇరు రాష్ట్రాలూ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించిన విషయం విదితమే. అయినాగానీ, ఇరు రాష్ట్రాల నుంచీ చర్చల దిశగా ముందడుగు పడటంలేదు. అసలేమయ్యింది కేసీయార్, వైఎస్ జగన్ మధ్య.? అంతలా ఇద్దరి మధ్యా రాజకీయ వైరం ఎందుకు పెరిగిపోయింది.? అంటే, అసలు ఇది వైరమే కాదు.. చిన్నపాటి పొలిటికల్ డ్రామా.. అనే విమర్శలు లేకపోలేదు. ఏది నిజం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఇరు రాష్ట్రాల ప్రజలకూ మంచిది కాదు. రాజకీయ నాయకులెప్పుడూ బాగానే వుంటారు.. ప్రజల మీదనే అన్ని సెంటిమెంట్లూ రుద్దబడతాయి.. ప్రజల మధ్యనే విభజన రేఖలూ గాయబడ్తాయ్.