Ys Jagan : ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి తీపి కబురు అందినట్టే అంది, ఉస్సూరమనాల్సి వచ్చింది

 Ys Jagan : ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి తీపి కబురు అందినట్టే అంది, ఉస్సూరమనాల్సి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడ్డు పుల్ల వేయడంతోనో, టీడీపీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పడం వల్లో ప్రత్యేక హోదా అంశం వెనక్కి వెళ్ళిపోయిందని నమ్మేంత అమాయకత్వమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో లేదు.

విషయాన్ని రాజకీయం చేయాలి గనుక, వైసీపీ వీలైనంత ఎక్కువ మేర రాజకీయం చేయడానికి ప్రయత్నించి భంగపాటుకు గురయ్యింది. చంద్రబాబుని తిడితే ప్రత్యేక హోదా వస్తుందా.? కేంద్రాన్ని నిలదీస్తే ప్రత్యేక హోదా వస్తుందా.? అన్న విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఖచ్చితమైన అవగాహన వుంది. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి.

‘అడుగుతూనే వుంటాం..’ అంటూ దాదాపు మూడేళ్ళు గడిపేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? రానున్న రెండేళ్ళు అత్యంత కీలకం. ప్రత్యేక హోదా విషయమై ప్రజలకు ఇచ్చిన హామీని (ఎన్నికల సందర్భంగా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు కదా!) నిలబెట్టుకోవాల్సిన బాధ్యవ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదనే వుంది.

లేదంటే, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబే బెటర్.. కేంద్రాన్ని నిలదీశారన్న అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్ళిపోయి, రాజకీయంగా వైసీపీ తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ లెక్కలు వైసీపీ అధినేతకు తెలియవని ఎలా అనుకోగలం.? కానీ, తెలిసీ ఆయన ఏమీ చేయలేకపోతున్నారు.. కేంద్రాన్ని నిలదీయలేక అచేతనంగా వుండిపోతున్నారు.

హోదా విషయమై గతంలో చేపట్టిన అవగాహనా కార్యక్రమాలు, నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు, రాజీనామాలు.. ఇవన్నీ ఏమైపోయాయో ఒక్కసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదేమో.!