దేశంలో ప్రస్తుతానికి మూడు వ్యాక్సిన్లు అందుబాటులో వున్నాయి. అందులో రెండు విదేశీ వ్యాక్సిన్లు కోవిషీల్డ్, స్పుత్నిక్ కాగా మరొకటి స్వదేశీ వ్యాక్సిన్ కోవాగ్జిన్. స్పుత్నిక్ వ్యాక్సిన్ చాలా తక్కువగానే అందుబాటులో వుంది. కోవీషీల్డ్ అన్నిటికంటే ఎక్కువగా అందుబాటులో వుంది. విదేశీ వ్యాక్సిన్ అయినా కోవిషీల్డ్ ఇండియాలోనే తయారవుతోంది.
సీరం ఇనిస్టిట్యూట్ దీన్ని తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. కోవిషీల్డ్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు, అనుమానాల్లేవు. కోవిషీల్డ్ తీసుకుంటే, విదేశాలకు వెళ్ళొచ్చు.. అక్కడ ఎలాంటి ఇబ్బందులూ వుండవు. కానీ, కోవాగ్జిన్ తీసుకుంటే మాత్రం కొన్ని దేశాలు దీన్ని గుర్తించడంలేదు. దాంతోపాటుగా, కోవాగ్జిన విషయమై ఇంకా చాలా అనుమానాలున్నాయి. దీని సమర్థతపై ఎప్పటికప్పుడు సరికొత్త అనుమానాలు తెరపైకి వస్తూనే వున్నాయి. ఎందుకిలా.? నిజానికి, స్వదేశీ వ్యాక్సిన్ గనుక.. కోవాగ్జిన్ మీద వచ్చే అనుమానాల విషయంలో కేంద్రం ప్రత్యేక జోక్యం చేసుకుని వుండాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని గుర్తించేలా కేంద్రం బాధ్యత తీసుకుని వుంటే బావుండేది. కానీ, అలాంటి ప్రయత్నాలేవీ కేంద్రం నుంచి జరగడంలేదన్న విమర్శలున్నాయి. దానికి కారణమేంటి.? కోవాగ్జిన్ సమర్థతపై కేంద్రానికీ అనుమానాలు వున్నాయా.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. అయితే, దేశంలో కోవాగ్జిన్ ద్వారా చాలామంది వ్యాక్సినేషన్ పొందారు. ఈ సంఖ్య లక్షల్లో.. కోట్లలో వుంది. అలాంటప్పుడు కోవాగ్జిన్ మీద ఇంకా ఈ అనుమానాలేంటి.? ఈ అనుమానాల కారణంగానే కోవాగ్జిన్ తీసుకున్నవారిలో కొంత ఆందోళన కనిపిస్తోంది.. వ్యాక్సిన్ పనిచేస్తుందా.? లేదా.? అని.