ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం, పేద కుటుంబాల్ని ఆదుకునేందుకు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ మేరకు బీమా కొత్త పాలసీని విడుదల చేసింది. నేటి నుంచి బీమా కల్పించే కార్యక్రమాన్ని మరింత వేగంగా చేపట్టబోతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. సహజ మరణం పొందితే ఫలానా మొత్తం, ప్రమాదవశాత్తూ మరణిస్తే పలానా మొత్తం.. అంటూ బీమా పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.
బ్యాంకులతో సమస్యలు రాకుండా, బీమా కంపెనీలతో ఇబ్బందులు తలెత్తకుండా, ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ dప్రకటించారు. అయితే, ఇది కొత్త వ్యవహారం కాదనీ, చంద్రబాబు హయాంలో వున్నదేననీ, అప్పట్లో రెండు కోట్ల మందికి పైగా లబ్దిదారులుంటే, ఇప్పుడు అందులో సగం మందికే ఇన్స్యూరెన్స్ (బీమా) వర్తింపజేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.
మొన్నటికి మొన్న దిశ యాప్ విషయంలో కూడా టీడీపీ ఇదే తరహా వాదన తెరపైకి తెచ్చింది. ఫోర్త్ లయన్ పేరుతో చంద్రబాబు హయాంలో వచ్చిన యాప్ తరహాలోనే దిశ యాప్ తెచ్చారంటూ ఎద్దేవా చేసింది టీడీపీ. ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో.. టీడీపీ, వైఎస్ జగన్ ప్రభుత్వం మీద సెటైర్లు వేస్తూ వస్తోంది.
సెటైర్లు వినడానికి బాగానే వుంటాయేమోగానీ, అన్నీ టీడీపీ హయాంలో అంత అద్భుతంగా జరిగితే, 2019 ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయినట్లు.? టీడీపీ ప్రచార ఆర్భాటాలకే పరిమితమైంది తప్ప, ప్రజలకు చిత్తశుద్ధితో మేలు చేయలేదన్నది వైసీపీ 2019 ఎన్నికల్లో చేసిన విమర్శ.
ఇప్పటికీ అదే విమర్శ చేస్తోంది కూడా. ప్రభుత్వాలు ఏం చేసినా, ప్రజలు అన్ని విషయాల్నీ పరిగణనలోకి తీసుకుంటారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు అలాగే బుద్ధి చెప్పారు మరి.