సుధీర్ జబర్దస్త్ నుండి వెళ్ళిపోవటం కారణం అదే: రాంప్రసాద్..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో జబర్దస్త్ గురించి కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులు జబర్దస్త్ గురించి అసలు విషయాలు బయటపెడుతున్నారు. జబర్దస్త్ లో పని చేసేవారిని జబర్దస్త్ యాజమాన్యం వారు కుక్కల్లా చూస్తారని, అక్కడ పనిచేసే వారికి సరైన భోజనం కూడా పెట్టరు అంటూ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా సుధీర్, రష్మి జబర్దస్త్ కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. జబర్దస్త్ లో సుధీర్ ని అవమానించడం వల్లే సుధీర్ జబర్దస్త్ కి దూరమయ్యాడు అంటూ ఆర్పి చెప్పుకొచ్చాడు. తొందర్లోనే అక్కడ పని చేసేవారందరూ బయటికి వస్తారని ఆర్పి వెల్లడించాడు.

అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది, రాంప్రసాద్ ఆర్పి చెప్పిన మాటలలో నిజం లేదని,ఆర్పి ఎందుకు అలా మాట్లాడాడో తమకి అర్థం కావటం లేదని వారు చెప్పుకొచ్చారు. జబర్దస్త్ యాజమాన్యం వారు అక్కడ పని చేసేవారిని చాలా బాగా చూసుకుంటారు. అక్కడ పెట్టె భోజనం కూడా చాలా బాగుంటుంది. అంతే కాకుండా మనం చేసిన పనికి మనం అడగకుండానే డబ్బులు మన అకౌంట్ లో వేస్తారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎంతో మంది జబర్దస్త్ ఆర్టిస్టులకు ఆర్థికంగా ఎంతో సహయం చేశారని ఆది చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో సుధీర్ జబర్దస్త్ నుండి బయటికి వెళ్ళిపోవటం కారణం ఏంటి? అని యాంకర్ ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు రాంప్రసాద్ సమధానం చెప్పాడు. ఈ క్రమంలో రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పుడు సుధీర్ ఇంత గొప్ప స్థాయికి రావటానికి కారణం జబర్దస్త్. అక్కడ సుధీర్, రష్మి మద్య లవ్ ట్రాక్ వల్లే వారిద్దరూ బాగా పాపులర్ అయ్యారు. ఆ విషయంలో వారిద్దరినీ ఎవరు బలవంతం చేయలేదని రాంప్రసాద్ వివరించాడు. సుధీర్ కి జబర్దస్త్ లో అవమానం జరిగిందని ఆర్పీ చేసిన వ్యాఖ్యలలో ఎటువంటి నిజం లేదని.. సుధీర్ కి సినిమా అవకాశాలు ఎక్కువగా రావటం వల్ల జబర్దస్త్ కి దూరమయ్యాడు. అంతే కాకుండా పక్క ఛానల్ వారు ఫైనాన్షియల్ గా ఎక్కువ ఆఫర్ చేయటంతో సుధీర్ జబర్దస్త్ నుండి వెళ్లిపోయాడని , అంతే తప్ప జబర్దస్త్ లో సుధీర్ కి ఎటువంటి అవమానం జరగలేదని రాంప్రసాద్ చెప్పుకొచ్చాడు.