రాష్ట్రాల నెత్తిన భారాన్ని ఎట్టకేలకు దించేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కరోనా వ్యాక్సినేషన్ వ్యవహారానికి సంబంధించి. 18 ఏళ్ళు పైబడినవారందరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సినేషన్ చేయిస్తుందని తీపి కబురు అందించారు ప్రధాని మోడీ. ఈ విషయంలో నరేంద్ర మోడీని అభినందించాల్సిందే.
నిజానికి, ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది ఈ విషయంలో. కానీ, వ్యాక్సిన్ తయారీ సంస్థలు 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేటుగా అమ్ముకోవచ్చని (ప్రైవేటు ఆసుపత్రులకు) అవకాశం కల్పించడమే ఒకింత అభ్యంతరకరంగా తయారైంది. దేశంలో తయారయ్యే కరోనా వ్యాక్సిన్, నిబంధనల మేరకు విదేశాలకు కొంతమేర ఎగుమతి చేస్తే, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
కానీ, 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్మకునేలా వ్యాక్సిన్ తయారీ సంస్థలకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సబబు.? ఆ 25 శాతం వ్యాక్సిన్లను కూడా కేంద్రమే కొనుగోలు చేస్తే, ఇంకా ఎక్కువమందికి ఉచితంగా వ్యాక్సిన్లు వేసే అవకాశం కేంద్రానికి దొరుకుతుంది. పోనీ, ఓ ఐదు శాతం వ్యాక్సిన్లను ప్రైవేటు రంగానికి వదిలేస్తే అది వేరే లెక్క.
ఎక్కడో వ్యాక్సిన్ తయారీ సంస్థలకు లాభం చేకూర్చేలా.. ప్రైవేటు ఆసుపత్రులకు లాభం చేకూర్చేలా.. మోడీ సర్కార్ ప్రత్యేకమైన ప్రేమాభిమానాల్ని వాళ్ళ మీద కురిపిస్తున్నట్లుగా అనుమానం కలుగుతోంది. నిన్నటికి నిన్న హైద్రాబాద్‌లో ఏకంగా ఒకే రోజు ఓ ప్రైవేటు ఆసుపత్రి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి 40 వేల మందికి పైగా ప్రజలకు వ్యాక్సిన్ అందించింది.
నిజానికి గొప్ప కార్యక్రమమే అది. అయితే, వ్యాక్సిన్ ధర 1,400 రూపాయలు. ఈ వ్యాక్సిన్లను ఉచితంగా తెలంగాణ ప్రభుత్వమే హైద్రాబాద్‌లో పంపినీ చేసి వుంటే.? వ్యాక్సినేషన్ విషయమై మోడీ సర్కార్ తప్పటడుగులు వేస్తూనే వుంది. రాష్ట్రాలన్నీ కేంద్రం తీరుని తప్పు పట్టిన నేపథ్యంలో చిన్నపాటి మార్పు కేంద్రంలో కనిపించింది. ఈ మార్పు మంచిదే.. కానీ, 25 శాతం విషయలోనూ మోడీ పునరాలోచించాలి.. ఆలోచిస్తే, దేశానికి మంచిది.. మోడీ ప్రభుత్వానికీ మంచిది.