షర్మిల, టీడీపీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడమేంటి.?

ఓ న్యూస్ ఛానెల్ కోసం వైఎస్ షర్మిల ఇంటర్వ్యూ ఇస్తే అది నేరమెలా అవుతుంది.? అవ్వదు. కాకపోతే, ఆ ఛానెల్ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకి చెందినది కావడమే.. ఇక్కడ అసలు సమస్య. వైసీపీ శ్రేణులు షర్మిల తీరుని తప్పు పడుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి అంటే గిట్టని టీడీపీ ఛానెల్ అధినేత పిలిస్తే, ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎలా వెళ్లారంటూ, వైసీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. సదరు టీడీపీ ఛానెల్ గతంలో షర్మిల మీద వివాదాస్పద రీతిలో కట్టుకథలు అల్లిందనేది వైసీపీ అభిమానుల ఆరోపణ. రాజశేఖర్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు టీడీపీతో కలిసి ఆ ఛానెల్ కుట్ర పన్నిందని వైసీపీ అభిమానులు అంటున్నారు. అయితే, తెలంగాణాలో రాజకీయంగా నిలదొక్కుకోవడానికి మీడియా సపోర్ట్ షర్మిలకి అవసరం.

సొంత మీడియా ఉన్నా, వేరే మీడియా సంస్థల సహకారం కూడా అవసరమని భావించి, తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ అనుకూల మీడియా ఛానెల్ సహాయాన్ని షర్మిల తీసుకుంటున్నారు. పార్టీ ఆలోచన షర్మిలకు వచ్చింది మొదలు ఆ ఛానెల్ ద్వారానే, షర్మిలకు సంబంధించిన కీలకమైన రాజకీయ వ్యవహారాలు బయటికి వస్తున్నాయి. ఆ ఛానెల్ కూడా షర్మిలను పట్టించుకోకపోతే, తెలంగాణాలో షర్మిల రాజకీయ వ్యవహారాలు ఎవరికీ కనిపించే అవకాశముండదు. ఇదంతా వ్యూహం ప్రకారమే షర్మిల చేస్తున్నారట. కానీ, షర్మిల వ్యవహార శైలిని వైఎస్ఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్ అభిమానుల్ని కాదని తెలంగాణలో షర్మిల రాజకీయం చేయడం అంత తేలకేం కాదు. ఎంతైనా టీడీపీ ఛానెల్ కదా.. అదును చూసి, షర్మిలను రాజకీయంగా దెబ్బ కొడితే ఏంటి పరిస్థితి.?